India Bypoll 2021 Results: BJP Won Seven Assembly Seats Out Of 29 - Sakshi
Sakshi News home page

Bypolls 2021 Results: జాతీయ స్థాయిలో కమలానికి షాక్‌

Published Wed, Nov 3 2021 5:08 AM | Last Updated on Wed, Nov 3 2021 12:03 PM

BJP won seven assembly seats out of 29  - Sakshi

మండి లోక్‌సభ స్థానంలో నెగ్గిన కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రతిభా సింగ్‌ విజయోత్సాహం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటుకు గురైంది. పేలవమైన ప్రదర్శనతో కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, దివంగత వీరభద్రసింగ్‌ సింగ్‌ సతీమణి ప్రతిభాసింగ్‌ మండీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు.

మండీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4,05,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామ్‌ స్వరూప్‌ శర్మ విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ప్రతిభాసింగ్‌.. కార్గిల్‌ యుద్ధవీరుడు, బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్‌ ఖుషాల్‌ ఠాకూర్‌ను ఓడించారు. 7,490 ఓట్ల మెజారిటీతో ప్రతిభాసింగ్‌ విజయం సాధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్‌ తన సత్తా చాటింది.

దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రానగర్‌ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేష్‌ గవిట్‌పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్‌ దేల్కర్‌ విజయం సాధించారు. గతంలో గెలిచిన ఖండ్వా లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ సింగ్‌ పూర్ణీపై బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ విజయం సాధించారు. ఈయన 82వేల మెజారిటీతో గెలిచారు. ఇక హిమాచల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

హిమాచల్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఫతేపూర్, అర్కీల్లో గతంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్‌–కోత్‌ఖాయ్‌ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు. బీజేపీ మహిళా అభ్యర్థి నీలం సెరాయిక్‌కు కేవలం 2,644 ఓట్లు పడ్డాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి తాజా ఫలితాలు శరాఘాతంలా తగిలాయి.  

పశ్చిమ బెంగాల్‌లో దీదీ హవా
పశ్చిమ బెంగాల్‌లో దిన్‌హటా, గోసాబా, శాంతిపూర్, ఖర్దాహ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటినీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో తమ సీట్ల సంఖ్యను 215కు పెంచుకుంది. ఈ నాలుగు స్థానాల్లో కలిపి మొత్తంగా తృణమూల్‌కు 75.02 శాతం ఓట్లు పడగా బీజేపీకి కేవలం 14.48 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఇప్పుడు 15 శాతంలోపునకు పడిపోవడం గమనార్హం.

దిన్‌హటాలో బీజేపీ అభ్యర్థి అశోక్‌ మండల్‌పై టీఎంసీ అభ్యర్థి ఉదయన్‌ గుహ ఏకంగా 1,64,089 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మొండల్‌ బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు. దిన్‌హటా, గోసాబా, ఖర్దాహ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రజలు ఉమ్మడిగా ఎలా ఓడిస్తారో ఈ ఫలితాలు చూస్తే తెలుస్తుందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో చెరొకటి
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరో స్థానంలో గెలిచాయి. సిండ్గీ స్థానం నుంచి బరిలో నిల్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌ మనగులిని బీజేపీ అభ్యర్థి రమేశ్‌ భూషనూర్‌ మట్టికరిపించారు. హంగల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్‌ సజ్జనార్‌ కంటే అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ మానె విజయం సాధించారు. ఈ రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను జేడీ(ఎస్‌) బరిలో నిలిపినా వారు కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. హింగల్‌లో ఓటమి.. రాష్ట్ర కొత్త సీఎం బొమ్మైకి కాస్త ఇబ్బందికరంగా మార్చింది. తన నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే హంగల్‌ ఉంది.

మధ్యప్రదేశ్‌లో రెండు ఇటు, ఒకటి అటు
రాష్ట్రంలో 3 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్‌ చేతిలో ఉన్న స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో బీజేపీ ఓడి కాంగ్రెస్‌కు అప్పజెప్పింది. ఈసారి జోబాట్‌(ఎస్‌సీ), పృథ్వీపూర్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, గతంలో గెలిచిన రాయ్‌గావ్‌(ఎస్‌టీ)లో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కల్పనా వర్మ గెలిచారు.  

అస్సాంలో అన్నీ బీజేపీ కూటమికే
అస్సాంలో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూటమి పార్టీలు తమ వశం చేసుకున్నాయి. భవానీపూర్, మరియానీ, తోరా స్థానాల్లో బీజేపీ గెలిచింది. గోసాయ్‌గావ్, తముల్పూర్‌లలో యూపీపీఎల్‌ విజయఢంకా మోగించింది. ఐదు స్థానాల్లో పోలైన మొత్తం ఓట్లలో 54 శాతం బీజేపీ, యూపీపీఎల్‌లకే పడ్డాయి.

► మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్‌ కూటమి మొత్తం మూడు సీట్లనూ కైవసం చేసుకుంది. రాజబాలా, మేరింగ్‌కెంగ్‌ లలో ఎన్‌పీపీ గెలవగా, మాఫ్లాంగ్‌ ఈ కూటమిలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఖాతాలో పడింది.
► బిహార్‌లో రెండు చోట్లా జేడీ(యూ) అభ్యర్థులే విజయబావుటా ఎగరేశారు. కుషేశ్వర్‌ ఆస్తాన్‌(ఎస్‌సీ) స్థానం నుంచి అమన్‌ భూషణ్‌ హజారీ, తారాపూర్‌ నుంచి రాజీవ్‌ కుమార్‌ సింగ్‌లు గెలిచారు.
► రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని కాపాడుకోవడంతోపాటు మరో సీటు గెల్చుకుంది. ఈసారి ధరియావాద్, వల్లభ్‌నగర్‌ల్లో కాంగ్రెస్‌ గెలిచింది.
► మహారాష్ట్రలోని నాందేఢ్‌ జిల్లాలోని
దెగ్లూ్లర్‌(ఎస్‌సీ) స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జితేశ్‌ రావ్‌సాహెబ్‌ గెలిచారు.
► హరియాణా రాష్ట్రంలోని ఎల్లెనాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ అభ్యర్థి అభయ్‌ సింగ్‌ చౌతాలా విజయం సాధించారు.
► మిజోరంలో తురియల్‌ స్థానంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) అభ్యర్థి లాల్‌దాంగ్‌లియానా గెలిచారు.  
► ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు(ఎస్‌సీ) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 90,533 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి పి.సురేశ్‌ ఓటమిని చవిచూశారు.  
► తెలంగాణలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement