BJP Worker Arrested for Tweet on Siddaramaiah Over Udupi College Case - Sakshi
Sakshi News home page

Udupi Washroom Video Incident: కర్ణాటక సీఎంపై అనుచిత ట్వీట్‌.. బీజేపీ కార్యకర్త అరెస్ట్‌

Published Fri, Jul 28 2023 6:54 PM | Last Updated on Fri, Jul 28 2023 7:07 PM

BJP worker arrested for tweet on Siddaramaiah over Udupi college case - Sakshi

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, తన కుటుంబంపై అనుచిత ట్వీట్‌ చేసినందుకు బీజేపీ మహిళా కార్యకర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఉడిపి కాలేజీలోని వాష్‌రూమ్‌లో విద్యార్థినులను రహస్యంగా వీడియో తీసిన కేసులో సీఎం కుటుంబ సభ్యులను తీసుకొస్తూ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో శంకుతల అనే కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఉడిపిలోని ఓ ప్రైవేట్‌ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ కళాశాలలో మైనార్టీ వర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళల టాయ్‌లెట్‌లో మొబైల్‌తో వీడియోలు చిత్రీకరించినట్టు గతవారం వెలుగు చూడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. టాయ్‌లెట్‌లో మొబైల్‌ ఫోన్‌ ఉండటాన్ని ఓ విద్యార్థిని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఇక  ఈ కేసులో మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. 
చదవండి: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్‌

ఈ ఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఉడిపి టాయ్‌లెట్‌ వీడియో స్కాండల్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్యపై సోషల్‌ మీడియాలో శంకుతల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఉడిపి కేసు స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయమని, దీనిని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్‌ చేసిన ట్వీట్‌ను ఆమె షేర్‌ చేశారు.

‘సిద్ధరామయ్య కోడలికో లేదా భార్యకో ఇలానే జరిగితే మీరు ఇలానే స్పందిస్తారా?’ అంటూ ఆ పోస్ట్‌పై కామెంట్‌ చేశారు. దీనిని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులోని హైగ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేయగా అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
చదవండి: వైరల్‌గా సోనియా, రాహుల్‌ గాంధీ, ప్రధాని మోదీ ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement