సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్‌లో ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రాగలిగింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
అయితే తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడంతో అధికారంలోకి వస్తామని లేదా అధిక సంఖ్యలో సీట్లు సాధించి కింగ్‌మేకర్ లేదా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది.
తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్రాల్లోనూ నిలిచి ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో మరింత బలోపేతమవుతున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఎందుకు విస్తరించలేకపోతు న్నది? అందుకు దారితీస్తున్న, ప్రభావం చూపు తున్న అంశాలేమిటి అన్న దానిపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం.
వరుస ఓటములతో..
కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, తెలంగాణలో ఓటమితో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. డీలా పడిన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటితో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రా యం పార్టీలో వ్యక్తమవుతోంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవ గా, వచ్చే ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టమిని అధిగమించినట్టు అవుతుందనే చర్చ అంతర్గతంగా ముఖ్యనేతల్లో సాగుతున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల కల్లా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు తెలిసింది.
ఇక్కడ స్పెషల్ ఫోకస్
ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాదిలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టు దొరక్కపోవడానికి కారణాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణాదికి సంబంధించి ప్రత్యేక ఎ జెండాకు తుది రూపం ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిని ఆనుకొని పొరుగున రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాల్లో 181 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 53 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను దాటి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే దిశగా కచ్చితమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్లనుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రపార్టీలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment