సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల ఆదరణ చెక్కు చెదరడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ప్రజల్లో రోజురోజుకీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాధరణ పెరుగుతోందన్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు ఎప్పుడూ చూసి ఉండరని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఇది సాధ్యమైందని ప్రశంసించారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని బొత్స కొనియాడారు.
చదవండి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల
వైఎస్సార్‌సీపీకి ప్రజలు 99 శాతం మార్కులు వేశారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినమాట నిలనేట్టుకునే దానిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేదానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు తమ పాలనపై బురద జల్లాలని ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని విశ్వసించలేదని చెప్పారు. కుప్పం ఫలితంతో అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇక చంద్రబాబు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఈవీఎంలను నిందించారని, నిన్న దొంగ ఓట్లు అంటున్నారని, ఆ భగవంతుడే చంద్రబాబును రక్షించాలని చురకలంటించారు.
చదవండి: కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం
‘ఇంకా ప్రజాసేవలో మరింత పునరంకితం అవుతాం. తక్కువ ఓట్లు వచ్చిన చోట సమీక్షించుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా అధిగమిస్తాం. చంద్రబాబులా కింద పడ్డా పైనే ఉన్నాం అనే పద్ధతి మాది కాదు. ఇప్పటికైనా ఆ పత్రికలు ఆలోచన చేసుకోవాలి. జనసేన, బీజేపీ పార్టీల ప్రభావం రాష్ట్రంలో లేదు. వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి ఉద్యమాన్ని కోర్టు స్వాతంత్ర్య ఉద్యమంగా చెప్పిందని నేనైతే నమ్మడం లేదు.
అమరావతి ఉద్యమం తమ ఆస్తులను కాపాడుకోడానికి చేస్తున్నదే. ఓ రాజకీయ పార్టీ చేయిస్తున్న ఉద్యమాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చలేం. ఎక్కడ రైతులు అమరులయ్యారు.? అందరూ అనారోగ్యంతో చనిపోయిన వారే. 700 రోజులు కాదు.. టీడీపీ ఉన్నంత కాలం ఆ ఉద్యమం కొనసాగుతుంది. కొంత మంది స్వార్థం కోసం టీడీపీ డబ్బిచ్చి నడిపిస్తున్న ఉద్యమం అది. అదే వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేం నిర్ణయాలు తీసుకుంటాం. ఏ ఒక్క వర్గం కోసమో పనిచేయం. అందరి కోసం పనిచేయడమే మా పార్టీ విధానం’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment