సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతోనే చంద్రబాబు రాష్ట్ర ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజులుగా కుప్పంపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుండటంతోనే తమకు పట్టం కడుతున్నారన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వంద శాతం విజయం సాధిస్తుందని చెప్పారు. త్వరలో కోర్టుల పరిధిలో ఉన్న 22 మునిసిపాలిటీలకు అనుమతులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
3 సార్లు సీఎంగా పని చేశానని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు కనీసం కుప్పం ప్రజలకు తాగునీటిని కూడా అందించలేకపోయారని విమర్శించారు.‘మైక్‌లు పట్టుకుని.. నేను పులివెందులకు నీళ్లిచ్చాను.. కుప్పానికి నీళ్లివ్వరా? అంటే.. కుప్పానికి నీళ్లు ఇవ్వకపోవడం ఎవరి తప్పు? ఆ ప్రజల బాధ్యత నీదికాదా? అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను ఎందుకు విస్మరించావు? తిరిగి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు’ అని చంద్రబాబును నిలదీశారు. కుçప్పంలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని దొంగ ఓటర్లంటూ అసత్య ప్రచారం చేశారని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని సరిగా గమనిస్తే ఎవరి మనుషులో, ఎవరి పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందన్నారు.
ఎన్ని జన్మలెత్తినా లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు
లోకేశ్ ఎన్ని జన్మలెత్తిన ఎమ్మెల్యేగా గెలవలేడని బొత్స విమర్శించారు. సీఎం జగన్‌ది ఇచ్చిన మాట నిలుబెట్టుకునే నైజమైతే.. చంద్రబాబు మోసం, వంచన, దగాకు ప్రతిరూపమన్నారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం తలపెట్టిన మంచి కార్యక్రమాలను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. న్యాయపరిధిలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని, కోర్టులను ఒప్పించి 3 రాజధానుల విషయంలో ముందుకెళ్తామన్నారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో తాము ప్రజా పాలనలో ఉన్నామని, తమ మధ్య వేరే రాజకీయ సంబంధం లేదన్నారు.
చదవండి: లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా.. మరి దొంగ ఓట్లు ఎలా?
Comments
Please login to add a commentAdd a comment