సాక్షి, అమరావతి: చట్టసభ హక్కుల్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గవర్నర్‌కు లేఖ రాయడం విడ్డూరమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శాసనసభ హక్కుల్ని, సభ్యుల బాధ్యతలను ప్రశ్నించే హక్కు ఎన్నికల కమిషనర్‌కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి, గవర్నర్‌కు సలహాలిచ్చే స్థాయి, అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ప్రశ్నించారు. శాసనసభ అధికారాలు, ఎన్నికల నిర్వహణపై అటార్నీ జనరల్‌తో మాట్లాడాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ సలహా ఇవ్వటమేంటన్నారు. గవర్నర్‌కు అధికారికంగా నిమ్మగడ్డ లేఖ రాస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలోనే ఎందుకు లీకులిచ్చారని ప్రశ్నించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతుంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ కోణంలోనే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేశామని వివరించారు.
అప్పుడు గుర్తు రాలేదా?
‘చంద్రబాబుతో నిమ్మగడ్డకు స్నేహం, చుట్టరికం ఉండవచ్చు. పదవి బాబు ఇచ్చి ఉండవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే ప్రభుత్వం సహించదు. 2018లోనే స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? చంద్రబాబు వద్దంటే నిర్వహించలేదా? లేక టీడీపీకి నష్టం జరుగుతుందనా? బాబు సీఎంగా ఉన్నప్పుడు గుర్తురాని బాధ్యత నిమ్మగడ్డకు ఇప్పుడు గుర్తొచ్చిందా?
ప్రజాప్రతినిధులను అవమానిస్తారా?
నిమ్మగడ్డ చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులను గేలి చేసే విధంగా, అవమానించేలా మాట్లాడుతున్నారు. కరోనా పరిస్థితులపై సీఎస్, డీజీపీ వివరిస్తే వారికేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం కాదు. ప్రభుత్వపరంగా, ఆయా శాఖల అధిపతులుగా చెప్పారని గుర్తుంచుకోవాలి.
హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ మూత..
ప్రభుత్వ రంగ పాల డైయిరీలను, చెరకు ఫ్యాక్టరీలను చంద్రబాబు గతంలో తెగనమ్మారు. చిత్తూరు డైయిరీ మూతపడటానికి చంద్రబాబు కారకుడు కాదా? హెరిటేజ్ కంటే పాడి రైతులకు లీటరుకు రూ.7 నుంచి రూ.10 ఎక్కువ వస్తున్నప్పుడు రైతులు పెట్టుబడిదారులుగా నడుస్తున్న అమూల్‌తో ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకోకూడదో చంద్రబాబే చెప్పాలి.
తెలియకుండా మాట్లాడొద్దు బాబూ..
ఏలూరులో వెలుగు చూసిన వింత రోగంపై అపోహలు నమ్మవద్దు. మంత్రి ఆళ్ల నాని, అధికార యంత్రాంగం ఏం జరిగిందో అధ్యయనం చేస్తూనే మరోవైపు బాధితులకు వైద్యం అందచేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 200 మందికిపైగా దీని బారిన పడగా 70 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్ అయ్యారు. నీటి శాంపిళ్లను విస్తృతంగా పరీక్షించాం. ఎలాంటి కాలుష్య కారకాల ఆనవాళ్లు లేవు. చంద్రబాబు ఏం జరిగిందో తెలుసుకోకుండా ముందుగానే తాగు నీరు కలుషితమైందని వ్యాఖ్యానించారు.
చట్టసభ హక్కుల్నే ప్రశ్నిస్తారా?
Published Mon, Dec 7 2020 3:46 AM | Last Updated on Mon, Dec 7 2020 3:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment