పదవిచ్చిన బాబు రుణం తీర్చుకోవడానికేనా.. మీ పాకులాట | Botsa Satyanarayana And Ambati Rambabu Fires On Nimmagadda Ramesh | Sakshi
Sakshi News home page

పదవిచ్చిన బాబు రుణం తీర్చుకోవడానికేనా.. మీ పాకులాట

Published Sun, Jan 24 2021 3:46 AM | Last Updated on Sun, Jan 24 2021 10:11 AM

Botsa Satyanarayana And Ambati Rambabu Fires On Nimmagadda Ramesh - Sakshi

నెల్లూరు (సెంట్రల్‌)/సాక్షి, అమరావతి: ‘‘అద్దాల మధ్య తాను సురక్షితంగా ఉండేలా విలేకరుల సమావేశం పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌... ప్రజలు, ఉద్యోగుల పట్ల అలా ఎందుకు ఆలోచించడం లేదు? ఆయన తీరు చూస్తుంటే.. అధికారం తప్ప బాధ్యతలు అక్కర్లేదని స్పష్టమవుతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుంటే ఎన్నికలు పెట్టడం ఎలా సాధ్యం? ఈ విషయంలో కనీసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా, ఉద్యోగుల మనోగతాన్ని తెలుసుకోకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం నిమ్మగడ్డ అహంకార వైఖరిని సూచిస్తోంది. అంతేగాక ఈ వ్యవహారంలో అధికారులపై బెదిరింపు ధోరణితో మాట్లాడడం బాధాకరం. ఆయన మాట తీరు ఎన్నికల కమిషన్‌లా కాకుండా.. ఓ రాజకీయపార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడినట్టుగా ఉంది’’ అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులు తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంత్రి పి.అనిల్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలతో కలసి బొత్స విలేకరులతో మాట్లాడగా.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌ వ్యవహరిస్తున్న తీరును వారీ సందర్భంగా ఆక్షేపించారు.

అధికారం తప్ప బాధ్యతలు పట్టవా? 
ఎన్నికల కమిషన్‌కు అధికారం ఉంటుందని, దీంతోపాటు బాధ్యత కూడా ఉంటుందని, అయితే నిమ్మగడ్డ మాత్రం అధికారం తప్ప, బాధ్యతలు పట్టించుకోవట్లేదని బొత్స విమర్శించారు. కోవిడ్‌పై సాక్షాత్తు ప్రధానమంత్రి జాగ్రత్తలు సూచిస్తున్నారని, అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాయుతంగా వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియలో ఏ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కోటిమందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలని ఈసీ రమేష్‌ చెబుతుండడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మౌనంగా ఉన్న నిమ్మగడ్డ ఇప్పుడు ఎవరి ప్రాపకం కోసం హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని పాకులాడుతున్నారని ప్రశ్నించారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికలను మొదలుపెట్టి మధ్యలోనే ఎందుకు వాయిదా వేశారో చెప్పాలన్నారు. అప్పట్లో కొన్ని మాత్రమే కరోనా కేసులు వస్తున్నాయని, అప్పుడు ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు వాయిదా వేశారని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. హడావుడిగా ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయడం ఎవరికోసమో నిమ్మగడ్డ చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, అయితే విపత్కర పరిస్థితుల్లో రెండు మూడు నెలలు ఆలస్యమైనంత మాత్రాన ఎటువంటి నష్టం ఉండదన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించరా?
రాష్ట్రంలో భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ను ప్రజలు గెలిపించారని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఎన్నికల కమిషన్‌ గౌరవించకపోవడం దురదృష్టకరమని బొత్స అన్నారు. అధికారులపైన, ప్రభుత్వంపైన ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. తాము న్యాయస్థానాలను గౌరవిస్తామని, ఎన్నికలపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, తీర్పు వచ్చేవరకు కూడా ఆగలేకుండా నోటిఫికేషన్‌ జారీ చేయడమేంటని నిలదీశారు. చంద్రబాబుకు పారితోషికం చెల్లించుకోవాలనా? మీకు పదవి ఇచ్చారనా, లేక మీ కులం అనా, మీకు చంద్రబాబు స్నేహితుడనా.. ఇలా ప్రవరిస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ మాటలు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదన్నారు. ఏకగ్రీవాలు అయితే వాటిపై దృష్టి పెడతామని ఈసీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఏకగ్రీవాలైనచోట ప్రత్యేకంగా నిధులిచ్చి ప్రోత్సహించడమనేది గతం నుంచీ జరుగుతున్నదని, ఈయన కొత్తగా ఏమి చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో లాలూచీపడి ఇలా చేయడం సరికాదన్నారు, వ్యవస్థలను కాపాడాలే తప్ప.. వ్యక్తులను కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు పార్టీకి పది శాతం కూడా ఓట్లు రావనే విషయం గుర్తుపెట్టుకోవాలని, చివరికి ఈసీ రమేష్‌కుమార్‌ ప్రచారం చేసినా ఓట్లు రావనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. 
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో మంత్రి అనిల్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద్‌రావు  

ఈసీనా.. రాజకీయ నాయకుడా..
రాష్ట్రంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న అధికారులపై రమేష్‌కుమార్‌ మాట్లాడిన తీరు బెదిరింపు ధోరణితో ఉందని, ఆయన మాటలు బాధాకరంగా ఉన్నాయని బొత్స అన్నారు. తానిప్పటి వరకు ఇటువంటి పరిస్థితులను చూడలేదని, ఈయన వంటి ఈసీ మనకు ఉండడం దురదృష్టకరమని చెప్పారు. తమకు ఎన్నికల కమిషన్‌పై చాలా గౌరవముందని, కానీ ఆయన తీరుపై ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు నిర్వహించిన ద్వివేది హుందాతనం గురించి నిమ్మగడ్డ తెలుసుకోవాలన్నారు. అప్పట్లో పాలకపక్షం, నాయకులు ద్వివేదిని విమర్శించారని, కానీ ఆయన ఎంతో హుందాగా, గౌరవంగా ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిపై ఈసీ నోటికొచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు. నిమ్మగడ్డ సెక్రటరీగా చేశారని, ఇలా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఐఏఎస్‌లో రమేష్‌కుమార్‌కు ఇదే నేర్పించారా? అని ప్రశ్నించారు. రమేష్‌కుమార్‌కు వచ్చిన అవకాశాన్ని వ్యక్తిగత అవసరాలకు, స్వార్థాలకు ఉపయోగించుకోవడం శోచనీయమన్నారు.

నిలువెత్తు అహంకారం: అంబటి
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అహంకారంతోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారన్నది రాష్ట్రప్రభుత్వ అభిప్రాయమని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు ఓటెయ్యని ప్రజలపై కక్ష తీర్చుకోవడమే ఆయన లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌ రాజకీయపార్టీ సమావేశంలా ఉందన్నారు. వ్యాక్సినేషన్‌ జరిగేప్పుడు ఎన్నికలు పెట్టడం ఎలా సాధ్యమన్నారు. ఆయనో రాజకీయపార్టీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని, నోటిఫికేషన్‌ విడుదలకోసం ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌ పార్టీ సమావేశంలా ఉందని మండిపడ్డారు. మూడు నెలల్లో పదవీకాలం ముగుస్తుందని, ఈలోగా ఎన్నికలు పెట్టాలన్న ఆరాటమే కనిపించిందని దుయ్యబట్టారు. 2018లోనే పెట్టాల్సిన ఎన్నికలను ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడీ న్యాయపోరాటం ఏమైందని ప్రశ్నించారు. 2019లో ఎన్నికలున్నాయని, చంద్రబాబుకు నష్టం జరుగుతుందని వాయిదా వేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. కరోనా భయంతో... ప్రజలకు దూరంగా హైదరాబాద్‌ ఇల్లు దాటని చంద్రబాబు, లోకేష్‌లు కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలనడంలో అర్థమేంటి? తనకు ఓటు వేయని ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోవాలని కోరుకోవడం దారుణమని అన్నారు.

ఇదేమి తీరు?
ఎన్నికల పేరుతో అధికారులపై ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం, అప్రజాస్వామికమని అంబటి అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఏరికోరి బదిలీ చేయడం సరికాదన్నారు. ఎన్నికలంటే 90 శాతం ఉద్యోగులు ప్రత్యక్ష విధుల్లోకి వెళ్లాలని, యావత్‌ ప్రజానీకం ఓటుహక్కు వినియోగించుకోవాలని, బీపీ, షుగర్‌ లాంటి వ్యాధిగ్రస్తులుంటారని, కరోనా మూలంగా వాళ్ళకేమైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలూ, దేశాల్లో వ్యాక్సినేషన్‌ సమయంలో ఎవరూ ఎన్నికలు నిర్వహించలేదన్న సంగతి గుర్తించాలన్నారు. టీడీపీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న కక్షతో చంద్రబాబు, ఆయనకు వంతపాడుతూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు నైతిక బాధ్యత వహించాలన్నారు.

ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖ ప్రెస్‌లో రావడం అన్యాయమంటున్న నిమ్మగడ్డ... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి లీక్‌ అవ్వడానికి ఏం సమాధానం చెబుతారని అంబటి ప్రశ్నించారు. అసలు టీడీపీ ఆఫీసుకు, నిమ్మగడ్డకు ఏం సంబంధమన్నారు. ఎందులోనైనా పరకాయ ప్రవేశం చేసే చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల కమిషన్‌లోనూ దూరి ఆడిస్తున్నాడన్నారు. ఎన్ని విద్యలు చేసినా ఆయన ఓటమి తథ్యమన్నారు. 151 సీట్లతో ఘనవిజయం సాధించిన పార్టీ తమదని, సంక్షేమ పథకాలతో జన హృదయాలు గెలుచుకుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వందశాతం విజయం సాధిస్తామని అంబటి చెప్పారు. అయితే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైందని, ఇప్పుడు ఎన్నికలు పెడితే కరోనా కేసులు పెరగొచ్చని, ఇదే జరిగితే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. తమకు వాళ్ళ ప్రాణాలే ముఖ్యమని, ఎన్నికలు జరిగే పక్షంలో వ్యాక్సినేషన్‌ సాధ్యం కాదని, అందుకే ఇప్పుడు ఎన్నికలు జరపొద్దని భావిస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు. కోర్టు తీర్పు తమకు శిరోధార్యమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement