సాక్షి, అమరావతి: సీనియర్ శాసనసభ్యులుగా, మంత్రులుగా తమ హక్కులకు భంగం కలిగించిన, తమ గౌరవాన్ని మంట గలిపేలా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యల నిమిత్తం వారు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను శనివారం వేర్వేరుగా స్పీకర్‌కు పంపించారు. ‘ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు రాసిన లేఖలో మాపై మోపిన నిందారోపణలు మాకు తీవ్రమైన బాధను, మానసిక వేదనను కలిగించాయి. ఆ కలతతోనే ఆ లేఖ గురించి మీ దృష్టికి తెస్తున్నాం. లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలుగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి’ అని వారు పేర్కొన్నారు. మంత్రులు స్పీకర్‌కు పంపిన నోటీసుల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ఆధారాలు చూపకుండా అపవాదులా?
► నిమ్మగడ్డ ఆ లేఖలో విద్వేషపూరితమైన, సత్యదూరమైన, నిర్హేతుకమైన వ్యాఖ్యలు చేశారు. లేఖ రాసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని బట్టబయలు చేస్తోంది. ఎలాంటి ఆధారాలు చూపకుండా, లక్ష్మణ రేఖను దాటినట్లు, ఎన్నికల నిబంధనావళి (మోడల్ కోడ్‌ను)ని ఉల్లంఘించినట్లు మాపై అపనిందలు వేయడం కచ్చితంగా మా హక్కులకు భంగం కలిగించడమే.. మమ్మల్ని అవమానపరచడమే.
► సీనియర్ శాసనసభ్యులుగా, కేబినెట్ మంత్రులుగా రాజ్యాంగ పరమైన సంస్థలపై, ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌పై మాకు అపారమైన గౌరవం ఉంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై తీవ్ర ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాయడం మమ్మల్ని విస్మయానికి గురిచేసింది.
► సభ్యులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం, అగౌరవ పరిచేలా, చులకన చేసేలా వ్యవహరించడం, దుష్ప్రచారానికి పూనుకోవడం శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించడమేనని సభాపతిగా మాకంటే మీకు బాగా తెలుసు.
హక్కుల రక్షణ బాధ్యత మీదే
సభాపతిగా శాసన సభ్యులకున్న హక్కులు, అధికారాలు, గౌరవాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. ప్రజల దృష్టిలో మమ్మల్ని అభాసుపాలు చేయాలని కుట్ర పూరితంగా అసత్య ఆరోపణలు, అభ్యంతరకర పదజాలంతో గవర్నర్‌కు లేఖ రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాం. ఆయనపై సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మా హక్కులను, గౌరవాన్ని కాపాడాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం.
లక్ష్మణరేఖ దాటుతోంది నిమ్మగడ్డే
సాక్షి, విశాఖపట్నం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తాను లక్ష్మణ రేఖ దాటుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాసిన లేఖను, అందులో ఆయన పేర్కొన్న అంశాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లిన నిమ్మగడ్డ అక్కడ ఆయన భాష, వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోందని, అసలాయన ఎన్నికల పర్యవేక్షణకు వెళ్తున్నారా లేక రాజకీయాలు చేయడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. తన పరిధిని దాటి పదేపదే రాజకీయాలు మాట్లాడి లక్ష్మణరేఖ దాటేది నిమ్మగడ్డ రమేష్‌కుమారే అని ధ్వజమెత్తారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తామెప్పుడూ రాజ్యాంగం, చట్టం ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పారు. పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా.. ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. అందుకే ఏకగ్రీవాలతో పంచాయతీలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
నిమ్మగడ్డను శాసనసభకు పిలిపించాలి
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు గౌరవ ప్రదంగా లేదని, అందుకే సభా హక్కుల నోటీసు ఇచ్చామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన్ను శాసనసభకు పిలిపించాలని కూడా స్పీకర్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఏదో తప్పు చేశామని, హద్దు దాటామని గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాయడంతో పాటు స్పందించకపోతే కోర్టుకు వెళ్తానని బెదిరింపులకు దిగడం దారుణం అని మండిపడ్డారు. ఆయన మోనోపోలీగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు. తన అధికారాలను తెలుసుకోకుండా, చంద్రబాబు కనుసన్నల్లో మితిమీరిన అధికారాలను వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. చచ్చిపోయిన టీడీపీని బతికించేందుకు నిమ్మగడ్డ తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతుంటే చంద్రబాబు ఓర్వలేక వేరే అర్థాలు చెబుతున్నారని, అలాంటి చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ యాక్ట్ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment