సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై నిందలు మోపేలా.. వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై విచారణ జరిపేందుకు అసెంబ్లీ సభా హక్కుల కమిటికీ సంపూర్ణ అధికారాలున్నాయని ఆ కమిటీ చైర్మన్, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎస్‌ఈసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం కలిగాయని.. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంటూ మంత్రులిద్దరూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. స్పీకర్ దీనిని హక్కుల కమిటీకి సిఫార్సు చేశారు. దీంతో వర్చువల్ విధానంలో కమిటీ మంగళవారం చైర్మన్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. అనంతరం ఈ సమావేశ వివరాలను కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరు నగరంలోని తన నివాసంలో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తనపై వ్యాఖ్యలు చేసినందున మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సపై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇటీవల గవర్నర్‌కు లేఖ రాశారని.. ఈ విషయంపై న్యాయస్థానానికి వెళ్తానని ఆయన అందులో పేర్కొన్నారని కాకాణి చెప్పారు. అయితే, ఆ లేఖ మంత్రులను ఇబ్బందులు పెట్టేలా, అగౌరపరిచేలా, బెదిరింపు ధోరణితో రాసినట్లుగా ఉందన్నారు. లేఖను పథకం ప్రకారం మీడియా, సోషల్ మీడియలో లీక్‌చేశారని, దీంతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని.. తమకు అవమానం జరిగిందని, అది బెదిరింపు ధోరణితో ఉందనే విషయాన్ని ఇద్దరు మంత్రులు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ఫిర్యాదు చేశారని వివరించారు. స్పీకర్ ఈ ఫిర్యాదును పరిశీలించి, అందులోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రూల్–173 కింద గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. గవర్నర్ కూడా రూల్–173 కింద ఈ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారని కమిటీ చైర్మన్ వివరించారు. దీంతో మంగళవారం ఈ ఫిర్యాదును అన్ని రకాలుగా అధ్యయనం చేశామని కాకాణి చెప్పారు. దీనిపై లోతుగా విచారణ జరిపి, అసెంబ్లీ ముందు ఉంచాలని సమావేశం భావించిందన్నారు.
ప్రివిలేజ్ కమిటీదే ఫైనల్
నిజానికి.. శాసనసభ నిబంధనలు 212, 213 కింద ఎవరినైనా పిలిచి విచారించడం లేదా, అవసరమైతే నోటీసులు జారీచేసే సంపూర్ణ హక్కులు ప్రివిలేజ్ కమిటీకి ఉన్నాయని కూడా కాకాణి స్పష్టంచేశారు. మంత్రుల ఫిర్యాదును అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత కమిటీకి దీనిని విచారించే అధికారం ఉందని నిర్ధారించామన్నారు. అందుకే దీనిపై విచారణ జరపాలని సూత్రపాయ్రంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. కమిషనర్ మాటలను కూడా రికార్డు చేస్తామని, తదుపరి.. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థకు అతీతంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని.. చట్టాలకు ఎవరూ అతీతులు కారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏదేమైనా తమ పరిధిలోనే విచారణచేసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల కమిషనర్‌కు జైలుశిక్ష
కాగా, మహారాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ తరహా ఉదంతాన్ని కాకాణి సమావేశంలో వివరించారు. 2006లో నందన్‌లాల్ అనే ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అప్పట్లో జనార్ధన్ చందుడ్కర్ అనే ఎమ్మెల్యే తన హక్కులకు భంగం కలిగిందని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపడం, కమిటీ అన్ని అంశాలను పరిగనణలోకి తీసుకుని అక్కడి ఎన్నికల కమిషనర్‌పై విచారణ చేపట్టిందన్నారు. విచారణ అనంతరం 2008 మార్చి 27న కమిషనర్‌కు వారం రోజుల జైలుశిక్ష విధించాలని కమిటి నిర్ణయించిందని కాకాణి చెప్పారు. ఆ శిక్షను అప్పటి ముఖ్యమంత్రి రెండ్రోజులకు మార్చారన్నారు. జైలు నుంచి వచ్చిన అనంతరం నందన్‌లాల్ కోర్టుకు వెళ్లారని.. కానీ, కోర్టు కూడా ప్రివిలేజ్ కమిటీలో తాము తలదూర్చబోమని విస్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. దీన్నిబట్టి ప్రివిలేజ్ కమిటీకి పూర్తి హక్కు, అధికారం ఉందనేది మహారాష్ట్ర హైకోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని, చర్యలు తీసుకునే అధికారం హక్కుల కమిటీకి ఉందని కాకాణి స్పష్టంచేశారు.
అచ్చెన్నాయుడు దాడి సిగ్గుచేటు
సమావేశంలో తెలుగుదేశం అరాచకాలపై కాకాణి స్పందిస్తూ.. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండాలనే ఏకగ్రీవాలపై దృష్టిపెట్టామని.. కానీ, తెలుగుదేశం వాళ్లు ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్ధంకావడంలేదని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో స్వయాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తన అన్న కొడుకుపై దాడిచేయడం సిగ్గుచేటన్నారు. దీనిని ఆ పార్టీకే చెందిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమర్ధించేలా మాట్లాడడం సిగ్గుచేటని కాకాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment