
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరచాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థపై మంత్రులు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
సచివాలయాల్లో ఆధార్ సేవలతో సహా అన్ని పౌరసేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సచివాలయ సిబ్బంది వృత్తి నైపూణ్యాలను పెంచడం కోసం శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఏటా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపడుతున్నామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం స్థాయిలో పర్యవేక్షిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సచివాలయాల స్థాయిలోకి తీసుకొచ్చి మంచి పాలనను చేరువ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది జనవరి 26 నుంచి ఈ నెల 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.08 కోట్లమంది వివిధ సేవల కోసం సచివాలయాలను ఆశ్రయించగా, 3.06 కోట్లమంది సేవలను పొందారని వివరించారు. రైస్ కార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక వంటి పథకాలను సచివాలయాల ద్వారానే పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment