ఓటమి భయంతోనే రాళ్ల దాడి డ్రామా | YSR Congress Party Leaders Fires On TDP And BJP | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే రాళ్ల దాడి డ్రామా

Published Wed, Apr 14 2021 2:32 AM | Last Updated on Wed, Apr 14 2021 9:08 AM

YSR Congress Party Leaders Fires On TDP And BJP - Sakshi

సాక్షి, తిరుపతి తుడా/ విశాఖపట్టణం: తిరుపతి లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు రాళ్ల దాడి డ్రామాకు తెరలేపాడని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. పథకం ప్రకారం రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం చంద్రబాబు రసవత్తరంగా నటించారని ఎద్దేవా చేసింది. తిరుపతిలో టీడీపీకి 25 నుంచి 30 శాతం ఓట్లే వస్తాయని, ఘోర పరాజయం తప్పదని, 70 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నాయని, 4 లక్షల మెజారిటీతో గురుమూర్తి గెలుపు ఖాయమని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వారు తెలిపారు. వైఎస్‌ జగన్‌ పాలనకు ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని ప్రజలు అనుకుంటారనే అక్కసుతోనే.. చంద్రబాబు ముందే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తిరుపతిలో, మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మంగళవారం ఈ అంశంపై మాట్లాడారు. 

రక్తి కట్టని బాబు డ్రామా
► ‘ఈ నెల 17 తర్వాత పార్టీలేదు.. బొక్కా లేదు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్నాడు. ఓటమి ఖాయమని చంద్రబాబుకూ తెలుసు. అందుకే ఈ రాళ్ల డ్రామా. ఆయన చూపిస్తున్న రాయి వేగంగా వచ్చి పడితే... తగిలిన వ్యక్తికి రక్తం కారాలిగా.. అదేదీ లేదంటే రాయి వేయడం అబద్ధమనేగా. 
► అసలు రాళ్లు వేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది? గెలిచే అవకాశమే లేని స్థితిలో చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయమే ఇది. పోలీసుల ప్రోద్బలంతోనే తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ఎలా చెప్పగలడు? ఏ ప్రాతిపదికన సీఎంపై ఆరోపణలు చేశాడు? 
► గాయపడిన వారే లేకుండా.. రాళ్ల దాడి జరిగిందని ఎందుకు డ్రామా ఆడారు? హఠాత్తుగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇతరులు మీడియా ముందు డ్రామాలు ఆడారంటే.. ఇది ముందుగా వేసుకున్న పథకమే. ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరాలని కూడా ముందుగా పథకం వేసుకున్నారు. 
► గవర్నర్‌ను కలిసేందుకు అంత హఠాత్తుగా అపాయింట్‌మెంట్‌ కోరారంటే.. దీని అర్థమేంటి? ఇది పచ్చిగా చంద్రబాబు మార్క్‌ దిగజారుడు రాజకీయం కాదా? పోలీసులు దర్యాప్తు చేసి ఈ కుట్రను బయటపెట్టాలి. 

దిగజారిన నడ్డా స్థాయి
► రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపణలు చేయడం దుర్మార్గం. ఆయన టీడీపీ అధ్యక్షుడి స్థాయికి దిగజారారు. ఏపీలో గతంలో చంద్రబాబు–బీజేపీ జాయింట్‌ పాలనలో మాదిరిగా ఇసుక వేలం వేసి దోపిడీ చేసే విధానం ఇప్పుడు లేదు. ప్రభుత్వమే నేరుగా అవినీతికి తావులేకుండా అమ్ముతోంది. 
► విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ పూర్తిగా భాగస్వామిగా మారింది. బిడ్డర్‌ ఎంపిక ప్రక్రియను ఎంఎస్‌టీసీయే చేపట్టింది. తన మాటల ద్వారా నడ్డా కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతిష్టను మంటగలపాలనుకుంటున్నారా?

మద్యం తగ్గించామా? పెంచామా?
► 2018–19లో 34 లక్షల కేసుల మద్యం విక్రయాలు ఉంటే, ఇప్పుడు 21 లక్షలకు తగ్గాయి. బీరు 17 నుంచి 7 లక్షల కేసులకు తగ్గింది. మద్యం షాపులను తగ్గించాం. టీడీపీ హయాంలో ఉన్న 48 వేల బెల్ట్‌ షాపులను మూయించాం. మద్యం విక్రయాల సమయం కుదించడమే కాకుండా, దేవాలయాలు, బడులు, బస్టాపుల పక్కన, రోడ్డు మీద మద్యం అమ్మకాలు లేకుండా చేశాం. 
► బీజేపీ పాలిత రాష్ట్రాల్లోగాని, కేంద్ర పాలిత ప్రాంతాల్లోగానీ ఇలాంటి చర్యలున్నాయా? మద్యం విక్రయాలు తగ్గితే లంచాలు ఎవరిస్తారో నడ్డానే చెప్పాలి. ప్రైవేటు పోర్టులో, ఆ కంపెనీకి చెందిన షేర్లను అదానీకి అమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వానికేం సంబంధం? అదాని ఎవరి మనిషి? ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకూ 14 సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో 6 సార్లు సమావేశమయ్యారు. 33 లేఖలు రాశారు.  హోంమంత్రి అమిత్‌షాతో 9 సార్లు సమావేశమయ్యారు. 

ప్రధాని ఒక్క సంతకం చేస్తే హోదా వస్తుంది
► దీర్ఘకాలంగా నెలకొన్న రాష్ట్ర సమస్యలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను బీజేపీ పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,549 కోట్లకు చేరాయి. ఇందులో ఆర్‌అండ్‌ ఆర్‌ కోసమే రూ.33,010 కోట్లు అవసరం. అంచనాలకు ఆమోదం తెలపమని కోరినా కేంద్రం స్పందించలేదు.
► ప్రత్యేక హోదా అనేది ప్రధాని ఒక్క సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం అంగీకరించింది. రూ.22,948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసింది. ఇప్పటి వరకు రూ.3,979.50 కోట్లే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇంకా రూ.18,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
► ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్నం లేదా రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉంది. వీటి గురించీ కేంద్రం నుంచి స్పందన లేదు. 
► ఆరేళ్లలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కింద కేవలం 7 జిల్లాలకు రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున విభజన జరిగిన తర్వాత 7 ఏళ్లలో రూ.2,450 కోట్లు రావాల్సి ఉంది.
► ఏపీ దిశ చట్టం– 2019కు ఆమోదం కోరినా పట్టించుకోలేదు. విశాఖ రైల్వే జోన్‌ ఇస్తున్నట్టు ప్రకటించినా ఒక్క పనీ జరగలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement