ప్రజల సర్వనాశనమే కాంగ్రెస్ లక్ష్యం: అంబటి రాంబాబు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం
సంప్రదింపుల్లేకుండా దారుణమైన నిర్ణయం చేసింది
ఇప్పుడా తప్పును ఇతర పార్టీలపై నెట్టాలని చూస్తోంది
అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేశారని చెప్పడం పచ్చి అబద్ధం
అధిష్టానం తమకు చెప్పలేదంటున్న నేతలకు ఆ పదవులెందుకు?
లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు గొడవచేస్తారు..
కేంద్ర మంత్రులు మాత్రం సీట్లలో కాలుమీద కాలేసుకుని కూర్చుంటారు..
చంద్రబాబు రాజధానిని నాలుగు లక్షల కోట్లకు అమ్మేసుకుంటారా?
సోనియా, దిగ్విజయ్‌లు తెలంగాణను కేసీఆర్‌కు రాసిచ్చారా?
సమస్యను తండ్రిలా పరిష్కరించాలన్నాం, ఆ మాటకే కట్టుబడి ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో రాజకీయ పార్టీగా తాను నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో మరెవ్వరినీ సంప్రదించకుండా రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడా తప్పును ఇతర పార్టీలపై నెట్టాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ పార్టీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి లేనిది కాంగ్రెస్ పార్టీకేనని ఎద్దేవా చేశారు. ‘‘పార్లమెంటులో బిల్లు ఓడిపోతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెబుతారు. మళ్లీ ఆయనే... మూడు రాష్ట్రాలుగా విభజించి హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలంటారు. ఇక చిరంజీవి... హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి ఉమ్మడి రాజధానిగా చేస్తారనో, లేదా దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తారనో చెబుతారు.
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి సమైక్యాంధ్ర మా వైఖరి అంటారు. కానీ అసలు వీరిది ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి మాత్రమే’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అనే పది తలల రాక్షసి పది నాలుకలతో మాట్లాడుతుందని, ఏరోజూ చెప్పింది చేయలేదని విమర్శించారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు సమైక్యాంధ్ర కోసం లేచి నినాదాలు చేస్తూంటే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మాత్రం కాలుమీద కాలేసుకుని తమ సీట్లలో కదలకుండా కూర్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వాలంటూ రాష్ట్ర అసెంబ్లీ రెండుసార్లు తీర్మానం చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు. అసెంబ్లీలో తెలంగాణ ఇవ్వాలంటూ తీర్మానం చేయనే లేదని స్పష్టంచేశారు. సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను, వారందరినీ తాము రక్షిస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలను అంబటి తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను గుజరాతీ, పంజాబీ, కర్ణాటక వారితో పోల్చవద్దన్నారు. వారంతా తమ రాజధానులను వదులుకుని వేరే రాష్ట్రంగా భావించే ఇక్కడకు వచ్చారని, కానీ సీమాంధ్రులు మాత్రం హైదరాబాద్ తమ రాజధాని అనుకుని ఒక భావోద్వేగంతో వచ్చారని చెప్పారు. సీమాంధ్రులకు ఇంతటి అనుబంధం ఉన్న హైదరాబాద్ విషయంలో ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం దారుణమని దుయ్యబట్టారు.
తండ్రిలా పరిష్కరించాలని చెప్పాం
విభజించాల్సి వస్తే అన్ని ప్రాంతాలవారితో సంప్రదింపులు జరిపిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఒక తండ్రిలాగా పరిష్కారం చేయాలని తమ పార్టీ సూచించిందని, ఇప్పటికీ అదే చెబుతున్నామని అంబటి స్పష్టంచేశారు. తమకు తెలియకుండా అధిష్టానం హఠాత్తుగా నిర్ణయం తీసుకుందని చెబుతున్న చిరంజీవి, జేడీ శీలం వంటి కేంద్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిలాంటి నేతలకు ఆ పదవులెందుకని ప్రశ్నించారు. విభజన జరిగే విషయం బొత్స, కిరణ్‌లకు నెలరోజుల ముందే తెలుసనే వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే కనీసం మంత్రివర్గ సహచరులకైనా ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమం జరుగుతుంటే పునర్నిర్మాణం చేసుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నారని, అంటే రాజధానిని నాలుగు లక్షల కోట్లకు అమ్మేసుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు జెండా పట్టుకుని తిరిగితే ఎవరూ నమ్మరని చెప్పారు. విభజన నిర్ణయం ఏకపక్షంగా వెలువడబోతోందని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినపుడే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయం ఆగిపోయి ఉండేదన్నారు. కేసీఆర్ వికృతరూపం ఏమిటో తెలంగాణపై నిర్ణయం వెలువడిన మూడు రోజులకే బయట పడిందని, ఆయనలా వ్యాఖ్యలు చేయడానికి సోనియా, దిగ్విజయ్ ఇద్దరూ కలిసి తెలంగాణను ఆయనకు రాసిచ్చారా అని అంబటి ప్రశ్నించారు.
షర్మిలకు అభినందనలు
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చారిత్రాత్మకమైన రీతిలో 3,112 కిలోమీటర్ల మరో ప్రస్థానం పాదయాత్ర చేసిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నామని రాంబాబు చెప్పారు. ఆమె యాత్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిందన్నారు. లక్ష్యాన్ని చేరకుండా యాత్ర ముగించిన కొందరిలా కాకుండా ముందు ప్రకటించిన లక్ష్యం ఇచ్ఛాపురాన్ని షర్మిల దిగ్విజయంగా చేరుకోగలిగారని కొనియాడారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించడంలో ఆమె సఫలీకృతం అయ్యారని ప్రశంసించారు.