కేంద్రంలో గత పదేళ్లలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు
రాంగోపాల్‌పేట్ /సికింద్రాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారని, కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్యాట్నీ సెంటర్‌లో నిర్వహించిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పుడు అవినీతి పెరిగిపోయిందని, ఆ పార్టీ నాయకుల మీద అవినీతి కేసులు నమోదై మంత్రులు కూడా జైలుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలో వచ్చిన పదేళ్లలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు.
ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించి రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ధ్వజమెత్తారు. కాగా, కిషన్‌రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసని కులం, మతం, రంగును ఆయన చూడరని, ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎలాంటి అవినీతి మరక ఆయనకు అంటలేదని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాల నుంచి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
పదేళ్లలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టాం: కిషన్‌రెడ్డి
గత పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.719 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేశానని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలను మరో మారు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, మరో మారు మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ కి రేపు అనేది లేదని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఈటల రాజేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, శ్యాంసుందర్‌గౌడ్, చీర శ్రీకాంత్ పాల్గొన్నారు.
కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా సాగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ నేతలు లక్ష్మణ్ తదితరులతో కలసి కిషన్‌రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎస్వీఐటీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభలో మాట్లాడారు. తర్వాత సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్ వేశారు.
ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. పార్టీ నేతలు లక్ష్మణ్, శ్యాంసుందర్‌గౌడ్, శారదామల్లేశ్, అజయ్‌కుమార్ ఆయన వెంట ఉన్నారు. కాగా, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కూడా రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment