సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. అయితే..
కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్‌ఎస్ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది.
మరోపక్క శనివారం ఉదయం అనుచర గణంతో సమావేశమైన కడియం, ఆయన కూతురు కావ్యలు పార్టీ మారబోతున్నట్లు నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. కావ్య తాను వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నానని.. తనను గెలిపించాలంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment