సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్).. వాటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న యువజన, విద్యార్థి వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తోంది. విద్యార్థి, యువజన, ఉద్యోగ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ సమ్మేళనాల ద్వారా ఆయా వర్గాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు ప్రణాళిక రూపొందించింది.
యువజన, విద్యార్థి సమ్మేళనాలతోపాటు వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక భేటీలు, సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ సమ్మేళనాలు, భేటీలకు సంబంధించిన షెడ్యూల్, విధి విధానాలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కమిటీలను పటిష్టం చేయడంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
‘హైదరాబాద్ స్టేట్’ ప్రాంతాలపై నజర్
మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలతో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై నెలకొన్న ఆసక్తిని అనువుగా మలుచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణతోపాటు పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లో బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. కనీసం 40 నుంచి 60 లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్నిస్థాయిల్లో పార్టీ నిర్మాణం ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 25న రాష్ట్రంలోని 19వేల జనావాసాల్లో పార్టీ జెండా పండుగతోపాటు అదే రోజున అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 3వేల మందితో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment