సాక్షి, తెలంగాణభవన్: రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవనం అని చెబుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభం కావాలి. కేసీఆర్ హయంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.
సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోతోంది. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. శత్రుదేశాలపై దాడి చేసినట్టు పేదల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో రూ.లక్షా 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళిస్తామన్నారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు.
మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. రేపు(శనివారం) ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను రెడీ. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్దాం. బాధితులకు మాట్లాడేందకు మీరు వస్తారా?. వారి వద్దకు వచ్చే దమ్ముందా? రివర్ ఫ్రంట్ ఏంటి..?. దాన్ని వెనుకున్న స్టంట్ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు మూసీ వద్దకు పోదాం. తర్వాత కొండ పోచ్చమ్మ సాగర్, మల్లన్నసాగర్, కిష్టాపూర్ వద్దకు వెళ్దాం అన్నారు.
మూసీలో పరివాహక ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. 10వేల మందికి సహాయం అవుతుంది అనుకుంటే మూడు నెలలు కాదు నాలుగు నెలలు మూసీ పక్కనే నివాసం ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది నాకు కృతజ్ఞత ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కృతజ్ఞత ఉండాలి. నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ చేసిండు. నేను అమరవీరులకు నివాళులర్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి నా వెనకాల నిలబడి హైట్ తక్కువ ఉంటాడు కదా.. కెమెరాల్లో కనపడాలని నక్కి నక్కి చూశాడు. మా మద్దతుతోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment