అసెంబ్లీ రద్దు కావొచ్చు: కేసీఆర్‌ | BRS Leader KCR Comments On CM Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ రద్దు కావొచ్చు: కేసీఆర్‌

Published Fri, Apr 19 2024 4:47 AM | Last Updated on Fri, Apr 19 2024 4:47 AM

BRS Leader KCR Comments On CM Revanth Reddy Govt - Sakshi

గురువారం బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్‌. చిత్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు 

20 నుంచి 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు 

పార్టీ శ్రేణులతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్య

కాంగ్రెస్‌లోకి వెళ్తే.. అంతా బీజేపీ కథ నడుస్తోందని వెళ్లిన వాళ్లంటున్నారు 

రేవంత్‌ వెంట బీజేపీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు 

20 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వస్తామన్నా.. వద్దని వారించా.. 

ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు, మరో 3 చోట్ల అవకాశం 

ఈ నెల 22 నుంచి రెండు వారాలపాటు విస్తృతంగా బస్సు యాత్ర 

బీఎల్‌ సంతోష్‌పై కేసు పెట్టినందుకు.. కవిత అరెస్టుతో కక్ష సాధింపు 

ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని వ్యాఖ్య 

‘‘బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉందంటూ ఆ పార్టీలోకి వెళితే.. అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు నాతో వాపోయారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా అని నన్ను సంప్రదించారు. కానీ ఇప్పుడు వద్దని వారించాను..’’  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని.. రేవంత్‌ బీజేపీలోకి వెళ్లినా ఆయన వెంట వెళ్లేందుకు కరుడుగట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.

పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘గతంలో బీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేలతోపాటు ఏడుగురు ఎంఐఎం సభ్యులను కలుపుకొని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. మనం అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశాం. ప్రధాని మోదీ దుర్మార్గుడు. తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా? రేవంత్‌ బీజేపీలోకి వెళ్లినా, వెళ్లకున్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఎనిమిది చోట్ల గెలుస్తాం..: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతాయని.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎవరికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినా సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో తొందరపాటు ఆలోచ నలు సరికాదని, కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు అక్కడి పరిస్థితులు చూసి తిరిగి వస్తామంటున్నారని చెప్పారు. కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని, బుల్లెట్లలాంటి నాయకులను తయారు చేసుకుంటామని పేర్కొన్నారు.

‘కొందరు నాయకులు వెళ్లినపుడు కొంత మంచే జరుగుతుంద’ంటూ కడి యం శ్రీహరి పార్టీ వీడటాన్ని ప్రస్తావించి విమర్శించారు. ‘‘2006 కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులు అందరూ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయినా భారీ మెజారిటీ సాధించాం. డబ్బులు ఉంటేనే గెలుస్తామనే అభిప్రాయం సరికాదు. ఇప్పటివరకు అందిన సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం. మరో మూడు చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు. 
 
బీఎల్‌ సంతోష్ పై కేసు వల్లే కవిత అరెస్టు.. 
‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఆయన ఆఫీసు దాకా వెళ్లారు. దీనిపై కక్ష సాధింపులో భాగంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారు. కవిత తప్పు చేసినట్టు వంద రూపాయల ఆధారం కూడా చూపలేదు. బీఎల్‌ సంతోష్ పై మనం కేసు పెట్టకపోయి ఉంటే కవిత అరెస్టు ఉండేది కాదు.

ఆమెను కుట్రపూరితంగా మద్యం విధానం కేసులో ఇరికించారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందనే అతి ప్రచారాన్ని సృష్టించారని చెప్పారు. జాతీయ స్థాయిలో వివిధ పారీ్టల నేతలతో తాను జరుపుతున్న సంభాషణల ప్రకారం.. మోదీ ప్రాభవం అంతగా లేదని స్పష్టమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా బలమైన నేత లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. 

ఈ నెల చివరి వారం నుంచి బస్సు యాత్ర.. 
ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేస్తానని.. సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్‌షోలు ఉంటాయని కేసీఆర్‌ తెలిపారు. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతానని వెల్లడించారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసి ఇస్తే షెడ్యూలు ప్రకటిస్తానని నేతలకు సూచించారు. కేటీఆర్, హరీశ్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకర్గాల్లో రోడ్‌ షోలలో పాల్గొంటారని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించలేదని.. మరో నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తే మెజారిటీ సీట్లు సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని చెప్పారు. 

ధాన్యం కొనుగోలు చేతకాదు.. 
‘‘రేవంత్‌ సందూక్‌లో సరుకు లేదు. ధాన్యం కొనుగోలు, రుణమాఫీ సహా ఏదీ ఈ ప్రభుత్వానికి చేతకాదు. ధాన్యం కొనుగోలును గాడిలో పెట్టేందుకు మనం అధికారంలో వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు శ్రమించాం. ధాన్యం బహిరంగ వేలంలో అవకతవకలు జరిగాయి. ధాన్యం కొనడం చేతకాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తున్నారు. రైతు సమస్యలపై పార్టీ నాయకులు, కేడర్‌ ఎక్కడికక్కడ స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద రూ.500 బోనస్‌ కోసం డిమాండ్‌ చేయాలి. ధాన్యం కొనుగోలుపై సిద్దిపేట తరహాలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్షలాది పోస్టుకార్డులపై ప్రభుత్వ హామీలను గుర్తుకు చేయాలి..’’ అని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ సూచించారు.

గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి కర్నాటక, తమిళనాడుకు నీళ్లు తరలించుకుపోయి ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ట్రిబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్న కేంద్రాన్ని అడ్డుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతేనని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ కట్టాలన్న సూచనలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే పార్టీ యంత్రాంగం అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్త సల్వాజి మాధవరావుపై పెట్టిన అక్రమ కేసులపై తాను సభలో మాట్లాడితే 10వేల మంది సోషల్‌ మీడియాలో ఆ వీడియో పోస్ట్‌ చేశారని తెలిపారు. 
 
అభ్యర్థులకు బీ ఫారాలు.. చెక్కుల పంపిణీ 
తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్‌.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రచార వ్యూహం, ఎజెండా, బస్సుయాత్ర వంటి అంశాలపై చర్చించి.. దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 17 మంది లోక్‌సభ అభ్యర్ధులకు బీ ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక అభ్యర్థి నివేదితకు బీ ఫారం, రూ.45 లక్షల చెక్కును అందజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement