బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్
రాష్ట్రంలో ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో?
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడతామని ఢిల్లీలో పోజులు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ .. రాష్ట్రంలో మాత్రం దానిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే పదవిని కోల్పోయేలా రాజ్యాంగాన్ని సవరించాలన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
స్పీకర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు
కర్ణాటకలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ రూ.50 కోట్ల చొప్పున కొనుగోలు చేస్తోందని అక్కడి సీఎం సిద్దరామయ్య ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో చూడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్పీకర్‌ను ప్రభుత్వంతో పాటు కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకున్నా ఎలాంటి కళంకం రాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు
సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకుంటే ప్రాణహాని పేరిట బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డీఎస్పీ స్థాయి అధికారులు బెదిరించారని చెప్పారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పారీ్టగా విమర్శించిన కాంగ్రెస్ తెలంగాణలో అదే పని చేస్తోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు, భవనాలపై ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తోందని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేల వ్యాపారాలపై విజిలెన్స్ విభాగాన్ని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారిపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
స్పీకర్‌తో భేటీ
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ మేరకు వేర్వేరుగా లేఖలు అందజేసింది. కేటీఆర్ నేతృత్వంలో 14 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. కాగా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment