సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేంతవరకు ఆందోళన, ఉత్కంఠల్లో మునిగిన గ్రేటర్ పరిధిలోని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. పేర్లు వెల్లడి కాగానే సంతోష సంబరాల్లో మునిగిన ఎమ్మెల్యే అభ్యర్థులు అంతలోనే ఎన్నికల సమయాన్ని, అయ్యే వ్యయాన్ని తలచుకొని ఖర్చు ఫోబియాతో ఆందోళనకు గురయ్యారు. ఈలోగా జమిలి ఎన్నికలు ప్రచారంలోకి రావడంతో ఖర్చులకు, ప్రచారానికి కాస్త విరామమివ్వవచ్చని ఊపిరి పీల్చుకున్నారు.
ఖర్చుల సంగతేంటి?
ఒకవేళ జమిలి ఎన్నికలే వచ్చినా.. ఎన్నికలు జరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా నియోజకవర్గంలో శ్రేణుల్ని కాపాడుకోవడం, ఖర్చులు భరించడం మరింత భారమే అయినప్పటికీ ఇంకా స్పష్టత రానందున విరామం దొరికిందని భావిస్తున్నారు. జమిలి జరిగితే ఆర్నెళ్లు, జరగకపోతే మూణ్నెళ్లు ఖర్చులు భరించాల్సి ఉన్నందున ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి హడావుడి చేయడం లేదు. ఇది పార్టీ శ్రేణులకు నిరాశ కలిగిస్తోంది. ప్రచారమూ, హడావుడి వంటివి లేకపోవడంతో తాము ఖాళీగా ఉండాల్సి వస్తోందని, విందు వినోదాలకు అవకాశం లేకుండా పోయిందని స్తబ్దుగా ఉన్నాయి.
అదే దారిలో అసమ్మతి నేతలు..
టికెట్ ఆశించి దక్కనందున అసంతృప్తిలో మునిగి అసమ్మతితో రగిలిపోతున్న నేతలు సైతం తమ కార్యాచరణకు విరామమిచ్చారు. తమ సత్తా చూపుతామని ఆవేశకావేషాలు ప్రదర్శించిన వారు నిశ్శబ్దంలో మునిగారు. ఉప్పల్ నుంచి టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తన కొడుక్కి టికెట్ రానందున మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తమ బలం, బలగం చూపాలనుకున్నప్పటికీ ఎన్నికలెప్పుడో తేలిన తర్వాతే కార్యాచరణకు దిగనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత రానున్నందున ఆ తర్వాతే తాము రంగంలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాక టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లడమా, మానడమా అనేది నిర్ణయించుకునేందుకు కూడా తగిన సమయం లభించిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,టికెట్ దొరకని అసంతృప్తులకూ, ఎన్నికైన వారి ప్రచారానికీ బ్రేకులు పడ్డాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోవైపు..
ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పలు పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఒకవేళ బిల్లు ఆమోదం పొంది రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మరింత ఆలస్యమే కాక 33 శాతం నియోజకవర్గాలను వారికి రిజర్వు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే వచి్చనవారి టికెట్లు కట్టవుతాయి. ఆ స్థానాల్లో మహిళా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుండటంతో అభ్యర్థుల దూకుడు తగ్గింది. దాంతోపాటే కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా తగ్గింది.
ఇది కూడా చదవండి: పొత్తు సరే.. సీట్ల మాటేంటి?
Comments
Please login to add a commentAdd a comment