భూ కబ్జా.. పొంగులేటి శ్రీనివాస్‌, హర్షా రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు: కేటీఆర్‌ | BRS Leaders Visit In vattinagulapally Over Land Issues | Sakshi
Sakshi News home page

భూ కబ్జా.. పొంగులేటి శ్రీనివాస్‌, హర్షా రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు: కేటీఆర్‌

Mar 30 2026 11:51 AM | Updated on Mar 30 2026 1:49 PM

BRS Leaders Visit In vattinagulapally Over Land Issues

సాక్షి, రంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటిస్తోంది. భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాధితులు.. మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో, కబ్జాకు గురైన భూములను బీఆర్‌ఎస్‌ బృందం పరిశీలించింది. కాగా, రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌ కబ్జాకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.

అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..‘మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. రాఘన కనస్ట్రక్షన్‌ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే భూమి ఉంది. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.

సర్వే పేరుతో 27 ఎకరాల భూమి స్వాధీనం..
దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.

ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. 

గవర్నర్‌కు ఫిర్యాదు.. 
అనంతరం.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్‌భవన్‌కు ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కనస్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై గవర్నర్ కు పిర్యాదు చేశాము. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు , ORR పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాము.

తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ..
ఇదే విషయంపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ పై CB CID విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు?. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా దోపిడిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement