సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు.
'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది. కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్‌ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment