
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రగతి భవన్ పేల్చాలన్న వాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ,మండలి మీడియా పాయింట్‌ల్లో బుధవారం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్ర డీజీపీతోపాటు పార్లమెంట్ స్పీకర్‌కు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సంఘ విద్రోహ శక్తులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. పేల్చేయడం, కూల్చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? దీనితో ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment