ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు నోటీసులిస్తారనే ప్రచారం
నోటీసులిస్తే స్పందించాల్సిన తీరుపై బీఆర్‌ఎస్ మల్లగుల్లాలు
న్యాయపరమైన అంశాలపై పార్టీ లీగల్ సెల్ సంప్రదింపులు
ఫార్ములా–ఈ నిర్ణయాలన్నీ తనవేనని గతంలో కేటీఆర్ ప్రకటన
అసెంబ్లీ సమావేశాల్లోనే అరెస్టు చేయవచ్చనే అంచనా!
కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను జనంలోకి తీసుకెళ్లడంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావుపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం కేటీఆర్‌కు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏసీబీ నోటీసులు, విచారణ తంతు జరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఏసీబీ నుంచి నోటీసులు అందే పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లీగల్ సెల్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఫార్ములా–ఈ రేస్ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు గతంలో మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు లగచర్ల ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో ఆయనను అరెస్టు చేయవచ్చని అప్పట్లోనే ఊహాగానాలు వచ్చాయి.
తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నవంబర్‌లో కేటీఆర్ ప్రకటించారు కూడా. అందులో భాగంగానే ‘ఫార్ములా–ఈ రేస్’ అంశాన్ని తాజాగా తెరమీదకు తెస్తున్నారని పార్టీ నేతల వద్ద కేటీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.
అసెంబ్లీని స్తంభింపజేసే యోచన
దర్యాప్తు సంస్థల నుంచి అందే నోటీసులకు సమాధానాలిస్తూ, విచారణలకు హాజరవుతూనే ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ఎలాంటి కార్యాచరణ అనుసరించాలనే కోణంలో పార్టీ నేతలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నోటీసులిస్తే సభలోనే చర్చకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
కేటీఆర్ అరెస్టు జరిగితే అసెంబ్లీని స్తంభింపజేసేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని, అవసరమైతే సమావేశాలను బహిష్కరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రేవంత్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేస్‌ను రద్దు చేయడంతో రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్లు నష్టం జరిగిందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి నిధులు చెల్లించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటోంది.
కక్ష సాధింపు రాజకీయాలను నిలదీద్దాం
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్.. ఈ అంశాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరడం, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసులు పెట్టడం ద్వారా పార్టీ ముఖ్య నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ లక్ష్యంగా కేసులు, అరెస్టులు జరిగితే క్షేత్రస్థాయిలో ఉద్యమకాలం నాటి తరహా ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.
బీజేపీ సహకరిస్తుందనే విమర్శలతో..
ఫార్ములా–ఈ రేస్‌లో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వడం వెనుక రాజకీయ కోణం ఉందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని, అందులోభాగంగానే గవర్నర్ అనుమతి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సీఎం రేవంత్ ఇటీవలి ఢిల్లీ పర్యటన, వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు వంటివి కూడా బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టడం లక్ష్యంగా సాగినట్టు బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment