సాక్షి, జనగామ: జనగామ జగడానికి తెరదించే పనిలో నిమగ్నమయ్యారు బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో రహస్యం భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు వద్దని పార్టీ నేతలను ఆదేశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య సమన్వయం సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించడంతో నిడికొండలో నిర్వహించిన మూడు మండలాల ఆత్మీయ సమ్మేళనానికి పల్లా గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
పెద్ద ఎత్తున ఆందోళనలు
తెలంగాణలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జనగామ టికెట్ విషయంలో సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని పల్లా గో బ్యాక్ అంటూ విమర్శలు చేశారు.
రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు
పల్లా మాత్రం బీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షులు జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య బేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిదుల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పల్లా తీరును ముత్తిరెడ్డి తో పాటు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే గత 15 రోజులుగా కేటీఆర్ విదేశాల్లో ఉండడంతో తిరిగి వచ్చాక జనగామ టికెట్ పై నిర్ణయం ఉంటుందని ప్రచారం జరిగింది. కేటీఆర్ రావడంతో ఆయన దృష్టిని ఆకర్షించి టికెట్ పొందేందుకు ఎవరికి వారుగా ముగ్గురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చదవండి: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నరోత్తమ్ నియామకం
కేటీఆర్ ఫోన్ రావడంతో
పల్లా ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గంలోని బచ్చన్నపేట తరిగొప్పుల నర్మెట్ట మూడు మండలాలకు చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరగా ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ ఫోన్ రావడంతో మధ్యలోనే వెనుతిరిగారు.
రాజకీయంగా రకరకాలుగా చర్చలు
అర్థాంతరంగా పల్లా ప్రగతి భవన్‌కు వెళ్లడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పల్లా రాకపోయినప్పటికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించి పల్లాకు అండగా ఉంటాం.. పార్టీ అందిష్టానం అతనికే టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనం జనగామ నియోజకవర్గ పరిధిలో కాకుండా స్టేషన్ ఘనపూర్ పరిధిలోని నిడికొండలో నిర్వహించడం రాజకీయంగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ఎలాంటి సమావేశాలు వద్దు
సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ఒత్తిడి మేరకు కేటీఆర్ పల్లా నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, రహస్య భేటీలకు చెక్ పెట్టేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్ విషయంలో జనగామలో పార్టీ మూడు ముక్కలుగా మారుతున్న తరుణంలో కేటీఆర్ రంగంలోకి దిగి గ్రూప్ రాజకీయాలకు టికెట్ జగడానికి తెరదించే ప్రయత్నంలో భాగంగానే ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే వరకు ముగ్గురు నేతలు సమన్వయంతో పని చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేటీఆర్ మదిలో ఏముందో, సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. జనగామ టికెట్ పై సస్పెన్స్ కు ఎప్పటిలోగా తెరపడుతుందోనని జనగామ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment