లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత కుమారుడికి టికెట్ ఇచ్చింది. ప్రతాప్‌గఢ్ పార్లమెంట్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది ప్రథమేష్ మిశ్రాను పోటీకి దింపాలని నిర్ణయించింది.
ప్రథమేష్ పొరుగున ఉన్న కౌశాంబి పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జి అయిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని కుమారుడు. పల్టాన్ బజార్‌కు చెందిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని గతంలో బీఎస్‌పీలో ఉన్నారు. 1999, 2007, 2012లో కుందా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2004లో ప్రతాప్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సింధూజా మిశ్రా సేనాని కూడా 2012లో విశ్వనాథ్‌గంజ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా, 2022లో కుందా నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఇక ప్రథమేష్ విషయానికి వస్తే సుప్రీంకోర్టులో న్యాయవాది అయిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రతాప్‌గఢ్‌లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సంగం లాల్ గుప్తా, సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ‘ఇండియా’ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ ఎస్పీ సింగ్ పటేల్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన కుమారుడి నిర్ణయమని, తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ప్రథమేష్ తండ్రి శివప్రకాశ్ మిశ్రా సేనాని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment