
అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న రాంజీ గౌతమ్, ప్రవీణ్‌కుమార్
కరీంనగర్ కల్చరల్: కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాంజీ గౌతమ్ విమర్శించారు. ఉద్యోగాలకల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీ కులగణన చేసి, బీసీల రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేవలం సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం లేదా ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఇక్కడి పేదలు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరని పేర్కొన్నారు. అంబేడ్కర్, పూలేæ, సాహు మహరాజ్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment