![Bsp Telangana Chief Rs Praveen Kumar Interview With Sakshi Tv](/styles/webp/s3/article_images/2023/11/24/praveenkumar.jpg.webp?itok=g8cHhB8y)
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు.
రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు.
దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు.
తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్‌కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment