![Budda Venkanna Over Action At Chandrababu Birthday Event - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/21/budda.jpg.webp?itok=NKw4S27I)
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ‘వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే వారిని చంపటానికైనా, చావటానికైనా ఈ వంద మంది సిద్ధంగా ఉంటారు. రానున్న రెండేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి చూస్తాం’ అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం ఆయన తన ఇంటి వద్ద ఉన్న కార్యాలయంలో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పంచామృతంతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. ‘చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై చెత్త వాగుడు వాగే బ్యాచ్‌కు హెచ్చరిక చేస్తున్నాం. పిచ్చి వేషాలు వేసే వైఎస్సార్ సీపీ బ్యాచ్ ఈ రెండేళ్లూ నోరు అదుపులో పెట్టుకోవాలి. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేసుకున్నాం’ అని హెచ్చరించారు.
చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని భావిస్తున్నారని, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అనంతరం ‘చంపటానికైనా, చావటానికైనా సిద్ధం’ అంటూ కార్యకర్తలతో శపథం చేయించారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment