యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా? | Buggana Rajendranath Reddy Comments On Yanamala | Sakshi
Sakshi News home page

యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా?

Published Sun, Feb 5 2023 4:56 AM | Last Updated on Sun, Feb 5 2023 9:20 AM

Buggana Rajendranath Reddy Comments On Yanamala - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర బిందువుగా ఏపీ ముందుకు సాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదైందన్నారు. అర్థ గణాంక శాఖ నివేదిక ప్రకారం.. ఈ విభాగంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీదే అగ్రస్థానమని స్పష్టం చేశారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ ప్రజలకు ఏ కష్టం రానీయలేదని గుర్తుచేశారు.

ఎన్నికల హామీలను మరిచిపోకుండా కోవిడ్‌ విపత్తు నుంచి బయటపడిన విధానాన్ని యావత్‌ ప్రపంచం మెచ్చిందన్నారు. దీంతో ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నిరాధార ఆరోపణలు, అసత్యాలతో ప్రకటనలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఆయన (–)4 శాతం వృద్ధిరేటు క్షీణత అని పత్రికా ప్రకటన ఇచ్చారని తెలిపారు.

ఈ మేరకు మంత్రి బుగ్గన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. యనమలతోపాటు టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థిర ధరల ప్రకారం లెక్కిస్తేనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతమని.. అదే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 18.47 శాతంగా ఉందని తెలిపారు. ఏ ప్రకారం చూసినా, ఏ విధంగా లెక్కేసినా వృద్ధిరేటు నాలుగు శాతం క్షీణించడం అనేది అసంభవమని స్పష్టం చేశారు. ఇంకా మంత్రి బుగ్గన ప్రకటనలో ఏం చెప్పారంటే.. 

జాతీయ స్థాయిని మించి వ్యవసాయంలో ఏపీ వృద్ధి 
వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 11.27 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో ఇది కేవలం 3.0 శాతమే. ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే కారణం. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించింది.

ఇవే కాకుండా ప్రతి గ్రామంలో సచివాలయాలు, మిల్క్‌ చిల్లింగ్‌ స్టేషన్లు, డిజిటల్‌ లైబ్రరీలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను కూడా నిర్మించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనమైనా నిర్మించారా అని యనమల ప్రశ్నించడం హాస్యాస్పదం. నవరత్నాల రూపంలో పేదలకు రూ.1.92 లక్షల కోట్లకుపైగా సాయం అందించాం. 104, 108 అంబులెన్సులు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, పశువుల కోసం ప్రత్యేకంగా మరో 340 వాహనాలు, స్కిల్‌ హబ్స్‌ ఇవన్నీ యనమలకు కనిపించడం లేదా? 

చంద్రబాబు హయాంలో కంటే మిన్నగా.. 
కోవిడ్‌ సమయంలో దేశ వృద్ధిరేటు (–)6.60 శాతం నమోదైతే రాష్ట్రం 0.08 శాతం వృద్ధి నమోదు చేసింది. 2018–19లో వ్యవసాయ రంగంలో 3.54 శాతం జీఎస్‌డీపీ మాత్రమే నమోదైంది. అదే 2021–22లో ఇది 11.27 శాతానికి చేరుకుంది. అలాగే 2018–19లో పారిశ్రామిక రంగంలో 3.17 శాతం జీఎస్‌డీపీ మాత్రమే నమోదైంది.

ఇది 2021–22కి 12.78 శాతానికి చేరుకుంది. అదేవిధంగా 2018–19లో సేవా రంగంలో 4.84 శాతం జీఎస్‌డీపీ మాత్రమే ఉండగా 2021–22కి ఇది 9.73 శాతంగా నమోదైంది. 2018–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.36 శాతం వృద్ధి రేటు మాత్రమే ఉండగా 2021–22లో ఏపీ 11.43 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 

అప్పులపైనా తప్పుడు ప్రచారం 
అప్పులపైనా టీడీపీ వర్గాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. 2022 మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.3,98,903 కోట్లని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ లెక్క ప్రకారం..ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,34,452 లక్షల కోట్లు మాత్రమే. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే రూ.2,64,451 కోట్ల రుణ భారంలో ఏపీ ఉంది.

ప్రస్తుత ధరల ప్రకారం.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,07,771 కోట్లు. దేశ తలసరి ఆదాయం రూ.1,50,007 కోట్లు. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం.. దేశ తలసరి ఆదాయం కంటే 38.5% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఏపీ దేశంలో ఆరో స్థానంలో ఉంది. ఈ విషయాల్లో యనమల చెప్పే లెక్కలన్నీ తప్పుడు లెక్కలే. అలాగే కేంద్ర గణాంకాల ప్రకారం.. తెలంగాణ 7.81 శాతంతో అత్యధిక ద్రవ్యోల్బణ రేటును కలిగి ఉంది.

తర్వాత మధ్యప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో ష్యూరిటీ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేసిన అప్పులు, గుదిబండలా వదిలేసిపోయిన బకాయిలు, నెలల తరబడి జీతాలివ్వక చిన్న ఉద్యోగులను క్షోభపెట్టిన వైనం, జన్మభూమి కమిటీల అరాచకాలు, భూముల కుంభకోణాలు, ఫైబర్‌నెట్‌ స్కామ్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లపై యనమలతో చర్చకు సిద్ధం. నీతిఆయోగ్‌ 2020–21లో ప్రకటించిన ఎస్‌డీజీ ఇండెక్స్‌ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. 2018–19లో ఈ స్కోర్‌ 64 మాత్రమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement