MK Stalin Says Call From Mamata Banerjee for Non-BJP CMs to Meet Soon - Sakshi
Sakshi News home page

స్టాలిన్‌, కేసీఆర్‌లకు మమతా ఫోన్ కాల్.. అందుకేనా..?

Published Mon, Feb 14 2022 3:28 PM | Last Updated on Mon, Feb 14 2022 3:47 PM

Call from Mamata, Stalin says non BJP CMs To Meet Soon - Sakshi

కోల్ కత్తా : దేశ రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు బీజం పడుతున్న సంకేతాలు మరోసారి స్పష్టంగా బయటకు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా కూటమి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. 

వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనతో మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా సీఎం స్టాలిన్ తెలిపారు. దేశంలోని బీజేపీయేతర సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాల్లో గవర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. ఈనెల 12న జరిగిన నాలుగు మున్సిపల్​సంస్థల ఎన్నికల్లో అధికార తృణముల్ పార్టీ(టీఎంసీ) భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీతో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ సంబంధాలేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలోచన లేకుండా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. తన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగానే తమిళనాడు సీఎంతో తాను మాట్లాడినట్టు మమత వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం తమతో చేతులు కలపాలని సీపీఎంను అడిగినట్టు పేర్కొన్నారు. అయితే తనకు ఎవరిపై వ్యక్తిగతంగా ద్వేషం లేదని అన్నారు. ఇదే క్రమంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయకపోవడంపై మమత స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను బలహీన పరచరాదనే ఉద్దేశ్యంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పారు. ఈసారి ఎస్పీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా మమత బెనర్జీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని మమతా వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తామని మమత స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement