సాక్షి, తిరుపతి: సొంత జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబునాయుడు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా నాయకులపై రుసరుసలాడుతున్నారు. ఎలాగైనా నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. కానీ ఆయన మాటలు విని ఎవ్వరూ ముందుకు రానంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు కాళ్లబేరానికి రావడం సబబుగాలేదని అంటున్నారు.
చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు..
బాబు హైరానా
జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు తమ పార్టీ మద్దతు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు నానా హైరానా పడ్డారు. శ్రీరంగరాజుపురం మండలంలో పలువురు గ్రామస్థాయి నేతలకు నేరుగా ఫోన్లుచేసి ప్రాధేయపడ్డారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనవని, ఎలాగైనా నామినేషన్ వేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థనను టీడీపీ శ్రేణులు తిస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నప్పుడు టీడీపీ తరఫున ఎలా పోటీ చేయమంటారని నేరుగా ఆయననే ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్నీ ఏకగ్రీవమైతే పార్టీ పరువు పోతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాటదాటేసినట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
చదవండి: పంచాయతీ పుట్టింది ఇలా..
కుప్పంలో ఎదురుగాలి
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పలువురు గ్రామ స్థాయి నాయకులకు చంద్రబాబు ఫోన్ చేసి నామినేషన్ల విషయమై చర్చించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2013 కంటే ఎక్కువ స్థానాల్లో టీడీపీ శ్రేణులు నామినేషన్లు వేసి గెలవాలని ఆదేశించినట్లు తెలిసింది. అందుకు తాము సుముఖంగా లేమని ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. అధికారంలో ఉన్నన్ని రోజులు పట్టించుకోని అధినేత ప్రస్తుతం పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
చిన్న ఉద్యోగం కోసం సాయం చేయమంటే అందుకు ఏ నాయకుడూ ముందుకు రాలేదని చెప్పినట్టు శాంతిపురంలో చర్చజరుగుతోంది. ఇక ఎస్‌ఆర్‌పురం మండలంలో 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకున్న ఓ కార్యకర్త ఇంటి స్థలం కోసం ఓ మండల స్థాయి నాయకుడి వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకున్నా.. కేవలం 2 సెంట్ల స్థలం ఇవ్వలేని పార్టీ కోసం తానెందుకు పోటీ చేయాలని ప్రశ్నించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment