సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాజమండ్రి ఈస్ట్‌జోన్ డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, చంద్రబాబు నిబంధనలకు విరుద్దంగా రోడ్ షో నిర్వహించారు. పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో, ఐపీసీ సెక్షన్లు 143, 359r/w, 149 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు సహా 8 మంది నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదైంది.
అనపర్తిలో జరిగింది ఇదే..
‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. బహిరంగ సభ కోసం అనుమతి కావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్‌యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్‌ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు.
దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్‌షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు.
దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment