ధర్నాలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాల వల్లనే రైతులు బజారున పడ్డారని, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, ఈ ఆందోళనలో 600 మంది రైతులు చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, యాసంగిలో వరి పంట సాగులో కేసీఆర్ ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఆర్డీవో కార్యాలయంలోకి రాకుండా మెయిన్ గేట్లు వేయడంతో చాడ ఆధ్వర్యంలో కార్యకర్తలు గేట్లను తొలగించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, రోడ్లపై ధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులకు అనుమతిచ్చిన పోలీసులు, శాంతియుతంగా ధర్నా చేసుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు డ్రామాలాపి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన ఇందిరాపార్క్ వద్దే నేడు టీఆర్‌ఎస్ ధర్నా చేస్తుందని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment