టీడీపీ సీనియర్ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయినట్లు సమాచారం. 52 రోజుల పాటు తాను జైల్లో ఉంటే పార్టీ సీనియర్లంతా తమ ఇళ్లకే పరిమితమై పార్టీని వదిలేశారని చంద్రబాబు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదల అయిన తర్వాత తనను స్వాగతించడానికి వచ్చిన సీనియర్లను చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఆ తర్వాత తనను కలిసి నేతలతో ఏంటి పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా? నేను అరెస్ట్ అయినా మీలో స్పందన రాదా? అని గుడ్లురిమినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని ఆయన దుయ్యబట్టారట.
ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీకి పేరు. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలు బలమని అంటారు. అటువంటి పార్టీ అధినేత ఓ అవినీతికేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ పకడ్బందీగాచేపట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరకుపోయిన తరుణంలోనూ పార్టీలో సీనియర్లు జూనియర్లూ కూడా తమకేమీ పట్టనట్లు ఉండిపోవడంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు లూటీ జరిగిన స్కిల్ స్కాం కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై మోపిన అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించడం వల్లనే ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తనను అరెస్ట్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటాయనుకున్నారు చంద్రబాబు. తనను జైలుకు పంపితే ఇక ఆందోళనలు మిన్నంటుతాయనుకున్నారు.1984లో ఎన్టీయార్ ను తప్పించి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినపుడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమించినట్లు తన విడుదల కోసం ప్రజలు నినదిస్తారని అనుకున్నారు.అయితే వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. ప్రజల మాట దేవుడెరుగు తమ సొంత పార్టీ శ్రేణుల నుంచే స్పందన లేకపోవడం చంద్రబాబుకు మింగుడు పడలేదు.
అప్పట్లో ములాఖత్ లో తనని కలవడానికి వచ్చిన యనమల , పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు నేను జైలు కెళ్లినా మీరంతా మీ ఇళ్లల్లో కూర్చుని కాలక్షేపం చేస్తే ఎలాగ? అని సీరియస్ అయ్యారు. కనీసం ఇప్పట్నుంచి అయినా ఆందోళనలపై దృష్టి సారించండి అని వారికి దిశానిర్దేశనం చేశారు.
అయితే ఆ తర్వాత కూడా నేతల తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం.. తన గురించి పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల చేత రక రకాల ఫిర్యాదులు అసత్య ప్రచారం చేయించారు.
అయినా సానుభూతీ రాలేదు..బెయిలూ రాలేదు. ఇక లాభం లేదని కంటి ఆపరేషన్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ కోరడంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆధారంగా చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నవంబరు 28న సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు నాయుడు తన కంటికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి జైలుకెళ్లి లొంగిపోవాలి.
అయితే జైలు నుండి మధ్యంతర బెయిల్ పై విడుదల కాగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే తప్ప పూర్తి బెయిల్ కాదని నిపుణులు అంటున్నారు. ఇక దీన్ని పక్కన పెడితే బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన తర్వాత చంద్రబాబు ను కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీనేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడితో పాటు మరికొందరిపై చంద్రబాబు నిర్లిప్తంగా వ్యవహరించారని అంటున్నారు.
తన సన్నిహిత వర్గాలతో మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలంతా వేస్ట్ ఫెలోసే అని చంద్రబాబు కారాలు మిరియాలు నూరారట. 52రోజుల పాటు నేను జైల్లో ఉన్నా వీళ్లకి పట్టదా? ప్రభుత్వంలో ఉంటే పదవులు కావాలని వస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు..పార్టీని పూర్తిగా గాలికి వదిలేసి ఎవరి ఇళ్లల్లో వాళ్లు రెండు నెలల పాటు కాలక్షేపం చేశారు అని చంద్రబాబు తీవ్ర ఆవేశంతో ఏకి పారేశారట.
త్వరలోనే పార్టీని సమూలంగా కింది నుంచి పైకి ప్రక్షాళన చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. నాలుగువారాల మధ్యంతర బెయిల్ ముగిసే లోపే పార్టీలో అసలైన విధేయులకు పదవులు బాధ్యతలు అప్పగించి.. విధేయంగా ఉన్నట్లు నటిస్తూ పదవుల్లో కూర్చున్నవారిని పక్కన పెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తాను జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు అంటున్నారు. మొత్తానికి జైలు కెళ్లడం కూడా ఒకందుకు తనకు మేలే చేసిందని.. తన వారెవరో నటించేదెవరో తేల్చుకోడానికి అది దోహద పడిందని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ లెక్కన అచ్చెంనాయుడికి పదవీ గండం ఉండచ్చని ఎన్టీయార్ ట్రస్ట్ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి.
- కుర్చీ కింద కృష్ణయ్య
Comments
Please login to add a commentAdd a comment