
సాక్షి, అమరావతి: ‘రాజధానిగా అమరావతి కామధేనువు వంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని.. ఇలా జరగడానికి తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని తెలిపారు. ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ ఇలా అన్నారు..
► మహానగరాలే అభివృద్ధికి మూల స్తంభాలు. ఐదు మహానగరాల నుంచే దేశంలో 66 శాతం ఆదాయం వస్తోంది. గుజరాత్‌లో ధోలేరాతోపాటు ఢిల్లీ–ముంబై కారిడార్‌లో 8 మహానగరాలు నిర్మిస్తున్నారు.
► అందుకే మా ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ఇంధన వనరుగా అమరావతి ప్రాజెక్టును చేపట్టింది.
► భూసమీకరణ కింద తీసుకున్న భూముల్లో అన్నీపోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వీటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి.
► అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 160 ప్రాజెక్టులు రూపొందించాం.
► నదుల అనుసంధానం కింద 63 ప్రాజెక్టులు చేపట్టాం. రూ.64 వేల కోట్లతో 23 ప్రాజెక్టులు పూర్తిచేశాం.
► సీఎం జగన్‌కు దూరదృష్టి లేదు. అమరావతి అంటే ద్వేషం. ఆ పేరు ఉచ్ఛరించడానికే ఇష్టపడటం లేదు. పోలవరంను కూడా భ్రష్టుపట్టించారు. కర్నూలు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం ఎలా వెళ్తారు? కనెక్టివిటీ ఎక్కడ ఉంది?
► శాంతికాముకులైన విశాఖపట్నం ప్రజలు రాజధాని కోరుకోవడం లేదు. అమరావతి రైతులకు అన్యాయం చేయాలనుకోవడం లేదు.
► వైఎస్సార్‌సీపీ నేతలు ఏ ఎండకా గొడుగు పడుతున్నారు. వాళ్లు కట్టు బానిసలు.
► రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన నాకు అవినీతి, కులం అంటగట్టారు.
► ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పోరాటం కొనసాగిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment