
మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు
తాడికొండ: తాను అమరావతిని రాజధాని చేస్తే, ఈ ప్రాంతంలోనూ ప్రజలు టీడీపీని ఓడించారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ వైఎస్సార్‌సీపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని. ప్రజలు అక్కడా ఓడించారని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్ద మహిళా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల భవిష్యత్తు అవసరాల కోసమే రాజధాని నిర్మాణం అని, 5 కోట్ల ఆంధ్రులు ఏకమై ఉద్యమించాలని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం అని, చరిత్రలో ఇది నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు, పన్నుల పెంపుతో బాదుడే బాదుడు జరుగుతోందని, రూ.10 వేలు ఇచ్చి రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశావ్.. నేను కన్నెర్రజేస్తే నువ్వు బయటకు రాలేవు’ అంటూ సీఎంపై మండిపడ్డారు.
ఎక్కడ పని చేస్తున్నా పోలీసులను వదలను
పోలీసులు చాలా ఎక్కువ చేస్తున్నారని, అన్నీ రికార్డు చేస్తున్నానని.. తర్వాత రికవరీ చేస్తానని హెచ్చరించారు. ఎక్కడ డ్యూటీలు చేస్తున్నా మిమ్మల్ని వదలనంటూ బెదిరింపులకు దిగారు. ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment