సీఎం జగన్‌పై దాడి వెనుక చంద్రబాబు ముఠా భారీ కుట్ర
ముందస్తు పన్నాగంతోనే పోలీసు అధికారులపై ఫిర్యాదులు
పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనే లక్ష్యం
తద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన
అందులో భాగంగానే ఐపీఎస్‌లపై పురందేశ్వరి ద్వారా చంద్రబాబు ఫిర్యాదు
ఎవర్ని నియమించాలో కూడా చెప్పిన పచ్చ ముఠా
తీవ్రంగా స్పందించిన అధికారులు.. పారని బాబు పాచిక
దాంతో సీఎం యాత్రలో దాడులకు కుతంత్రం
తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించే కుట్ర
దెబ్బ తగిలినా చిరునవ్వుతో సీఎం జగన్ శాంతి సందేశం
సీఎం జగన్ సందేశంతో సంయమనం పాటించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బెడిసికొట్టిన చంద్రబాబు కూటమి కుతంత్రం
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తథ్యమని గుర్తించిన విపక్ష కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో భారీ కుట్రకు బరితెగించింది. అందుకోసం పక్కా పన్నాగంతో పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనేందుకు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్ర పన్నింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి దీనికి బలం చేకూరుస్తోంది.
సీఎం జగన్‌పై జరిగిన ఈ దాడి ఆషామాషీగానో, ఆకతాయిగానో చేసింది కాదని, దాని వెనుక భారీ కుట్రే ఉందన్నది తేటతెల్లమవుతోంది. రెండు నెలలుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేస్తున్న దుష్ప్రచారం వెనుక గూడుపుఠాణి ఉందన్న విషయం ఈ దాడితో బట్టబయలైంది.
పోలీసు వ్యవస్థపైనే గురిపెట్టిన పచ్చ ముఠా
నిత్యం ప్రజాధరణతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించలేమని చంద్రబాబు ఏనాడో గుర్తించారు. అందుకే పవన్, పురందేశ్వరితో కూటమి కట్టారు. రాష్ట్రంలో ధ్వంస రచనకు కుట్ర పన్నారు. అందులో భాగంగానే కీలకమైన పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్సైస్థాయి అధికారుల వరకు అందరిపై నిరాధార ఆరోపణలకు తెరతీశారు.
వలంటీర్లు రాష్ట్రంలో యువతులను అపహరిస్తున్నారని పవన్ జుగుప్సాకరమైన ఆరోపణలకు కూడా దిగారు. అయినా పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోందని అవాకులు చవాకులు పేలారు. ఇక బీజేపీతో పొత్తు కుదరగానే చంద్రబాబు ముందస్తు వ్యూహంతో పురందేశ్వరిని రంగంలోకి దింపారు. చంద్రబాబు ఇచ్చిన జాబితా ప్రకారం ఆమె ఏకంగా రాష్ట్రంలో 20 మందికిపైగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వారందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించాలని, వీలైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. వారి స్థానాల్లో ఎవర్ని నియమించాలో కూడా దగ్గుబాటి పురందేశ్వరే నిర్దేశించడం కూటమి కుట్రకు పరాకాష్ట. అంటే పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకొని, ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడాలన్నది చంద్రబాబు ముఠా లక్ష్యమన్నది సుస్పష్టమైంది.
తీవ్రంగా స్పందించిన పోలీసు వ్యవస్థ
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారంపై యావత్ ఐపీఎస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏకంగా ఎన్నికల కమిషన్ అధికార పరిధిలోకి జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దాంతో తమ పన్నాగం బెడిసికొట్టిందని పచ్చ కూటమి అహం దెబ్బతింది.
శాంతిభద్రతలను దెబ్బతీసే కుట్రమరోవైపు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రకు ప్రజాధరణ వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు ముఠా మరింత బెంబేలెత్తింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందిందని, శాంతిభద్రతలు గాడి తప్పాయన్న తమ దుష్ప్రచార కుట్రను పతాక స్థాయికి తీసుకెళ్లడానికి వ్యూహం పన్నింది. అందుకు సీఎం బస్సు యాత్రను అవకాశంగా మలచుకొన్నారు. విజయవాడలో సీఎం జగన్‌పైనే దాడికి పాల్పడాలని కుట్ర పన్నారు. శనివారం రాత్రి అదే పని చేశారు.
ఈ దాడికి క్షణికావేశంలో ఎవరైనా స్పందిస్తే.. దాన్ని అవకాశంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులు, ప్రతిదాడులకు పురికొల్పి, పెను విధ్వంసానికి పాల్పడాలన్నది పచ్చ ముఠా కుతంత్రం. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి చంద్రబాబు ముఠా బరితెగించింది. ఈ పరిస్థితులను ఎత్తి చూపుతూ తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులకు వ్యతిరేకంగా మరోసారి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
దాంతో అధికార వ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేసి ఎన్నికల్లో అక్రమాలకు బరితెగించాలన్నది చంద్రబాబు ముఠా అంతిమ లక్ష్యం. కానీ దాడికి గురై, గాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిరునవ్వుతోనే యాత్రను కొనసాగించడం ద్వారా పార్టీ శ్రేణులన్నీ పూర్తి సంయమనం పాటించాలనే సందేశాన్ని ఇచ్చారు. సీఎం జగన్ సందేశాన్ని అందిపుచ్చుకొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తి సంయమనం పాటించాయి. దాంతో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తలేదు. చంద్రబాబు కుట్రలు బెడిసికొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment