మా పేరుతో.. పచ్చి మోసం | Chandrababu Govt Scam: Agreement with Siemens and Designtech companies | Sakshi
Sakshi News home page

మా పేరుతో.. పచ్చి మోసం

Published Wed, Sep 13 2023 1:47 AM | Last Updated on Wed, Sep 13 2023 1:38 PM

Chandrababu Govt Scam agreement with Siemens and Designtech companies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పేరుతో చంద్ర­బాబు సర్కారు సీమెన్స్, డిజైన్‌టెక్‌ కంపెనీలతో కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంలో కుతంత్రం బట్టబయలైంది. తమ పేరుతో కుదుర్చు­కున్నట్లు చెబుతున్న ఒప్పందం గురించి తమకు ఏమాత్రం సంబంధం లేదని, అసలు ఆ ఒప్పందం గురించే తమకు తెలియదని సీమెన్స్‌ కంపెనీ వెల్లడించింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద తాము 90 శాతం నిధులను సమకూరుస్తామని చెప్ప­లేదని స్పష్టం చేసింది.

మోసపూరితంగా తమ కంపెనీ పేరును వాడుకుంటూ దీన్ని రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపారని తెలిపింది. ఈమేరకు జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్‌ఎస్‌డీసీకి పంపిన ఈ–మెయిల్‌తో వాస్త­వాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించేందుకు ఓ పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.70 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేశారని అందులో పేర్కొంది.

మరి మిగిలిన రూ.300 కోట్లు ఏమయ్యాయో వెల్లడించకపోవడం ద్వారా ఆ నిధులు కొల్లగొట్టినట్లు పరోక్షంగా అంగీకరించింది. ప్రభుత్వ వాటాగా 10 శాతం నిధులను విడుదల చేశామని పేర్కొన్న టీడీపీ మరి 90 శాతం కింద సీమెన్స్, డిజైన్‌టెక్‌ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని మాత్రం దాటవేయడం గమనార్హం. షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు సర్కారు నిధులు కొల్లగొట్టిన విషయాన్ని సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు.

90 శాతం నిధులా..? వంద శాతం మోసమే
మాజీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా సీమెన్స్‌ కంపెనీ ముసుగులో ఒప్పందం పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లు ఆ కంపెనీ పంపిన ఈ – మెయిల్‌తో స్పష్టమైంది. ఏపీఎస్‌ఎస్‌డీసీకి పంపిన ఈ – మెయిల్‌లో సీమెన్స్‌ ఇంకా ఏం చెప్పిందంటే..

ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాదు
ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు ఒప్పందం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకు మేం బాధ్యత వహించం. ఆ ప్రాజెక్టు  వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా సమకూరుస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. మా కంపెనీ పేరుతో సుమన్‌ బోస్‌తోపాటు జీవీఎస్‌ భాస్కర్, భావనా గుప్తా, ప్రతాప్‌ బొంతా, రాహుల్‌ సెహ్‌గల్, ఆశీష్‌ శర్మ, సతీశ్‌ కురుప్‌ తదితరులు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు.

90 శాతం నిధులను సమకూరుస్తామని వారు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సీమెన్స్‌ కంపెనీ బాధ్యత వహించదు. డిజైన్‌ టెక్‌ కంపెనీతో కలసి సుమన్‌ బోస్‌ దురుద్దేశపూరితంగా వ్యవహరించారు. మోసపూరితంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. సీమెన్స్‌ కంపెనీ 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద నిధులు సమకూరుస్తుందని సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పూర్తిగా మోసపూరితం. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాము. మాకు సంబంధం లేదు.’

గంటా సుబ్బారావు దరఖాస్తే చేయలేదు 
ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం మా కంపెనీకి ఎలాంటి దరఖాస్తూ చేయలేదు. సీమెన్స్‌ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఐఎస్‌డబ్లూ భారత్‌లో మా సాఫ్ట్ట్‌వేర్‌ విక్రయాలను పర్యవేక్షిస్తుంది. కానీ ఆ కంపెనీ భారత్‌లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. కాబట్టి మేం 90 శాతం నిధులు సమకూరుస్తామనే ఒప్పందం పూర్తిగా బోగస్‌. 

సుమన్‌ బోస్‌ చాటింగ్, ఈ మెయిల్స్‌ ఇవిగో..
మా కంపెనీ ముసుగులో సుమన్‌ బోస్, ఇతరులు డిజైన్‌ టెక్‌తో జరిపిన ఈమెయిల్స్, వాట్సాప్‌ చాటింగ్, బ్రౌజింగ్‌ హిస్టరీని డిలీట్‌ చేశారు. వాటిని మేం రిట్రీవ్‌ చేసి నాలుగు డ్రైవ్‌లలో మీకు అందిస్తున్నాం. మా కంపెనీ ముసుగులో చేసిన మోసం కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. 

అయితే మాత్రం అరెస్టులా..?
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. “ఔను నిధులు కొల్లగొట్టాం.. అయితే మాత్రం కేసు పెడతారా..? అరెస్ట్‌లు చేస్తారా..? అలాగైతే అది వేధించడమే...!’ అనే తరహాలో వితండవాదం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. అంశాలవారీగా టీడీపీ వాదనలో డొల్లతనం ఇదీ...

రూ.300 కోట్లు లూటీని ఒప్పుకున్న టీడీపీ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్లతో సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో 90 శాతం నిధులను సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు ఇవ్వాలని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలన్నది ఒప్పందమని టీడీపీ పేర్కొంది. గత ప్రభుత్వం తన వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు విడుదల చేసినట్లు కూడా అంగీకరించింది.

అందులో సీమెన్స్‌ కంపెనీ నుంచి డిజైన్‌ టెక్‌ కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ కోసం రూ.70 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ( వాస్తవానికి డిజైన్‌ టెక్‌ రూ.56 కోట్లే చెల్లించింది. ఆ విషయాన్ని సీమెన్స్‌ కంపెనీ ఈ మెయిల్‌లో వెల్లడించింది. టీడీపీ వాదనను పరిగణలోకి తీసుకుని రూ.70 కోట్లు చెల్లించారని భావించినా మిగిలిన రూ.300 కోట్లు ఏం చేశారన్న దానిపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. అంటే ఆ రూ.300 కోట్లను కొల్లగొట్టినట్లు ఆ పార్టీనే పరోక్షంగా ఒప్పుకుంది.

90 శాతం నిధులతో సాఫ్ట్‌వేర్‌ ఎక్కడ?
సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు సమకూరుస్తాయన్నది ఒప్పందం అని టీడీపీ పేర్కొంది. మరి ఆ మొత్తాన్ని సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలు వెచ్చించాయా? లేదా? అన్న విషయాన్ని మాత్రం టీడీపీ వెల్లడించ లేదు. 90 శాతం రాయితీతో సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్‌ సంస్థ రూ.70 కోట్లకు సమకూర్చిందని చెబుతోంది.

మరి అలాంటప్పుడు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎందుకు చూపినట్లు..? అందులో ప్రభుత్వ వాటా కింద 10 శాతాన్ని జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు ఎందుకు చెల్లించినట్లు? నిధులు కొల్లగొట్టేందుకే రూ.70 కోట్ల ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.3,300 కోట్లుగా కాగితాలపై చూపించి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసినట్లు టీడీపీ ప్రకటనే చెబుతోంది. 

బాబు ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నిధులు
స్కిల్‌ స్కామ్‌లో నిధుల విడుదలకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులది బాధ్యత కాదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్పటి ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నాటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతోనే నిధులను విడుదల చేస్తున్నట్లు నోట్‌ ఫైళ్లలో స్పష్టంగా ఉంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతతోపాటు పలువురు  అధికారులు, ఇతరులను విచారించిన అనంతరం సీఐడీ వాస్తవాలను నిగ్గు తేల్చింది. 

సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించింది..
అసలు నిధులను ఎక్కడ మళ్లించారని టీడీపీ ప్రశ్నిస్తోంది. షెల్‌ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్త సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆధారాలతో సహా నిర్ధారించాయి. 

షెల్‌ కంపెనీలు ఏసీఐ, నాలెడ్జ్‌ పోడియమ్, ఈటా, పాట్రిక్స్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్‌వెబ్, పోలారీస్, కాడెన్స్‌ పార్టనర్స్‌ ద్వారా నిధులను తరలించినట్లు నిగ్గు తేల్చాయి. ఈ కేసులో సీఐడీ ఇప్పటివరకు చంద్రబాబుతోసహా 9 మందిని అరెస్ట్‌ చేసింది. వారిలో నలుగురిని ఈడీ అరెస్ట్‌ చేయడంతోపాటు ఆ షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) సైతం నిర్ధారించింది. 

విదేశాలకు పరారయ్యారు కదా...
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు నిధులు తరలింపులో పాత్రధారిగా వ్యవహరించిన మనోజ్‌ పార్థసాని రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. దీనిపై స్పందించకుండా వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏమిటని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.

దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ లభించిన ఆధారాలను బట్టి విచారణ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ  కేసులో సీఐడీ కూడా అదే చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే వారు విదేశాలకు పరారైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయగలరో, దర్యాప్తును పక్కదారి పట్టించగలరో ఈ ఉదంతమే రుజువు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసింది. 

దర్యాప్తు సాగేకొద్దీ సూత్రధారులు తెరపైకి..
స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్‌ పేరిట ఏర్పాటైన కొత్త శాఖలో అన్ని వ్యవహారాలు అధికారులే చూశారని, అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కేవలం పర్యవేక్షించారని టీడీపీ పేర్కొంది. ఈ కేసులో అచ్చెన్నాయుడును ఇరికించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కానీ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ లభిస్తున్న ఆధారాలతో ఈ కుంభకోణం అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతోంది.

ఆ ఆధారాలతోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని వెల్లడైంది. నోట్‌ ఫైళ్లు మాయమైనా అధికారులు అందుబాటులో ఉన్నారని, వారిని విచారించాలని టీడీపీ వాదిస్తోంది. అంటే నోట్‌ ఫైళ్లను మాయం చేశామని ఆ పార్టీ అంగీకరించినట్లే కదా! అందుబాటులో ఉన్న అధికారులను విచారించి, ఇతర అంశాలను నిగ్గు తేల్చి పూర్తి ఆధారాలతోనే సీఐడీ కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చింది. 

అన్నిటికి సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంతోపాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను వెలుగులోకి తేవటాన్ని చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సీఐడీ కీలక ఆధారాలను సేకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చిన వైనం, ఆ అలైన్‌మెంట్‌ను ఆనుకుని వందలాది ఎకరాలను ఎలా సేకరించారు?.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి బినామీల ద్వారా అసైన్డ్‌ భూములు ఎలా కొల్లగొట్టారు? లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ ప్రోకోకు ఎలా పాల్పడ్డారు.. తదితరాలన్నీ బట్టబయలయ్యాయి. ఆ కేసుల్లో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. తమ అవినీతి బాగోతం సాక్షాధారాలతో రుజువు కావడంతో ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది.

అవినీతి నెట్‌వర్క్‌ గుట్టు రట్టు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముసుగులో చంద్రబాబు ఖజానా నుంచి విడుదల చేసిన రూ.371 కోట్లు ఎక్కడకు వెళ్లాయన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఆ నిధులన్నీ షెల్‌ కంపెనీల ద్వారా చివరకు చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. షెల్‌ కంపెనీల కమీషన్లు పోనూ రూ.241 కోట్లను అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా చంద్రబాబు నివాసానికి చేరినట్లు గుర్తించారు. మరోవైపు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టు కేటాయింపులలోనూ చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు.

షెల్‌ కంపెనీల ద్వారా బాబుకు డబ్బులు చేరాయిలా..
► టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. 
► డిజైన్‌ టెక్‌ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. 
► పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్‌ కంపెనీ­లతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...
ఏసీఐ: రూ.56 కోట్లు, నాలెడ్జ్‌ పోడియమ్‌: రూ.45.28 కోట్లు, ఈటా: రూ.14.1 కోట్లు, పాట్రిక్స్‌: రూ.3.13 కోట్లు, ఐటీ స్మిత్‌: రూ.3.13 కోట్లు, భారతీయ గ్లోబల్‌: రూ.3.13 కోట్లు, ఇన్‌వెబ్‌: రూ.1.56 కోట్లు, పోలారీస్‌: రూ.2.2 కోట్లు, కాడెన్స్‌ పార్టనర్స్‌: రూ.12 కోట్లు
► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించాడు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పాడు. అంటే ఆ రూ.140.53 కోట్లను చివరకు 
చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. 
► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీల­కు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అ­క్క­డ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. 
► అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా ఇలా రూ.241 కోట్లు గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement