వివేకా వర్థంతిన సునీత రాజకీయం!
తండ్రి హత్య కేసులో ప్రత్యర్థి వర్గం డైరెక్షన్‌లోనే మీడియా ముందుకు
ఇప్పుడు ఆత్మీయ సమావేశం పేరిట పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేసే ఛాన్స్
కడప ఎంపీ లేదంటే పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్న సునీత
టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే తహతహ
నో చెప్పిన చంద్రబాబు.. ఇండిపెండెంట్‌గా వెళ్లాలని సూచన!
ఇన్నాళ్లూ వెనకుండి.. ఇప్పుడు టికెట్ ఇవ్వరా? అని సునీత నిలదీత
15వ తేదీన వీడనున్న అసలు ముసుగు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్థంతి నాడు(మార్చి 15న).. ఆయన కుమార్తె సునీత రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తండ్రి హత్య కేసులో ఆయన ప్రత్యర్థి వర్గంతోనే మొదటి నుంచి వెంట నడుస్తున్న సునీత.. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ విషయంలోనూ ఆ వర్గం సూచనలే పాటించబోతున్నట్లు స్పష్టమౌతోంది. ఈ క్రమంలో ఆమెకు ఊహించని ఝలక్ సైతం తగిలినట్లు సమాచారం!.
తండ్రి వివేకా వర్థంతినాడు రాజకీయానికి నర్రెడ్డి సునీత సిద్ధమైంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాదు.. మరో నెలరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులే ఇప్పుడు చర్చిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే.. ‘వివేకా కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది’ అంటూ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో లీకులు చేయించి గ్రౌండ్ లెవల్‌లో రెడీ అయ్యారు. తొలుత వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగినా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు సునీత కూడా చేరారు. టీడీపీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.
సునీత మనసులో..
తల్లి సౌభాగ్యమ్మ కాదు.. తెలుగు దేశం కండువా తానే కప్పుకోవాలి.. టీడీపీ అభ్యర్థిగానే కడప ఎంపీ లేదంటే పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయాలి. ఒకవేళ మరీ వ్యతిరేకత కనిపిస్తే అప్పుడు తల్లిని సీన్‌లోకి తెచ్చి సానుభూతి ఓట్లకు ట్రై చేద్దాం.. ఇదీ సునీత మనసులో మాటగా పులివెందుల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వివేకా కేసుపై మాట్లాడే వంకతో.. మొన్నీమధ్యే ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపడంతో తన పని మరింత తేలికైందని భావించారామె. అయితే.. ఇక్కడే చంద్రబాబు తన మార్క్ చూపించారు.
అలా ఇచ్చేస్తే.. ఎలా?
పులివెందుల పరిణామాలపై అప్రమత్తమైన చంద్రబాబు.. కొందరు టీడీపీ పెద్దల్ని సునీతతో మాట్లాడించారు. ఒకవేళ సునీతకు టికెట్ ఇస్తే ఇన్నాళ్లూ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోతుందని.. టీడీపీకి ఆమె అందిస్తున్న చీకటి సహకారం గురించి ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఆమెకు సర్దిచెప్పే యత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం కండువా కప్పుకునే ఆలోచన పక్కనపెట్టాలని.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆమెను ప్రొత్సహిస్తున్నట్లు సమాచారం. అప్పుడు టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ, అవసరమైతే కాంగ్రెస్ మద్ధతు ఇప్పించే బాధ్యతను చంద్రబాబే తీసుకుంటారని సునీతకు వాళ్లు భరోసా ఇచ్చే యత్నమూ చేశారు. అయితే..
ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న సునీత డైలమాలో పడ్డట్లయ్యింది. స్వతంత్ర అభ్యర్థి అంటే అసలు జనం పట్టించుకుంటారా?.. పైగా ఇన్నాళ్లూ వెనకుండి నడిపించి ఇప్పుడు టికెట్ ఇవ్వరా? అని టీడీపీ పెద్దల్ని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో సునీత అభ్యంతరాల గురించి బాబుతో మాట్లాడాలని ఆ టీడీపీ పెద్దలు.. ఈ గ్యాప్‌లో ప్రస్తుత పరిస్థితిని తన వర్గంతో చర్చించాలని సునీత నిర్ణయించుకున్నారు.
కొసమెరుపు..
వైఎస్సార్‌సీపీని ఎలాగైలా బద్నాం చేయాలనే పచ్చ బ్యాచ్ కుట్ర మరోసారి బట్టబయలైంది. ఆత్మీయ సమావేశం కడపలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సునీత.. అంతకు ముందు పులివెందులలో ఓ ఫంక్షన్ హాల్ కోసం ట్రై చేస్తే అనుమతి దొరకలేదని.. వైఎస్సార్‌సీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఇదంతా జరిగిందని ప్రచారం చేయించారు. యెల్లో మీడియా సైతం దీనిని కథనాలుగా ప్రచురించుకున్నాయి. అయితే ఇదంతా ఒట్టి కట్టుకథేనని ఇప్పుడు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment