కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో ఒక కథనం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ప్రచారం చేసిన ఒక రాజకీయ నేతను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నేత. గుజరాత్‌లో జరిగిన వంతెన ప్రమాదం నేపథ్యంలో మోదీ పర్యటనకు అయిన ఖర్చుపై ఆయన ఒక మెస్సేజ్‌ని పార్వర్డ్ చేశారు. పోలీసులకు ఆ విషయమై ఒక ఫిర్యాదు అందింది. తదుపరి ఆ నేత గురించి పోలీసులు వాకబ్ చేసి రాజస్థాన్‌లోని జైపూర్‌లో పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ కూడా ఆయనను రిమాండ్‌కు పంపించింది.
అలాగే మరి కొంతకాలం క్రితం గుజరాత్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై అసోంలో అరెస్టు చేశారు. ఆయనను వారం రోజులకు పైగానే జైలులో ఉంచారు. మరి అదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలో ఉంటుందా?. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే భిన్నమైన అంశాలు గోచరిస్తాయి. ఈ మధ్య ఒక రిటైర్డ్ పాత్రికేయుడు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఒక అసత్యపు ప్రచారాన్ని పార్వర్డ్ చేశారు. ఒక బంగారం సగ్మింగ్ కేసులో సీఎంవో పాత్ర ఉందని ఆ ప్రచారం సారాంశం. దానిపై చర్య తీసుకోవాలని అధికారులు సూచించగా, పోలీసులు ఆ పాత్రికేయుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టింది.
అయితే చట్టంలోని సెక్షన్ 41 సి ప్రకారం నోటీసు ఇవ్వలేదు కనుక ఆయనను బెయిల్‌పై వదలి వేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు సంబంధిత సెక్షన్‌లు ఈ కేసులో చెల్లవని పేర్కొంది. కోర్టు వారు సాంకేతిక కారణాలతో నిర్ణయాలుచేసి ఉండవచ్చు. కాని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అంశాన్ని కూడా తన ప్రచారానికి వాడుకుని ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి కృషి చేస్తున్నారు. అంతే తప్ప, ఎవరూ అభ్యంతరకరంగా వ్యవహరించరాదని ఒక సీనియర్ నేతగా చెప్పడం లేదు.
మరి ఇదే చంద్రబాబు హయాంలో ఎంత మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారో గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్‌లో ఉన్నవారిని సైతం రాత్రికి, రాత్రి పట్టుకువెళ్లి అనేక మందిని జైలులో పెట్టారు. కొందరిని విజయవాడలో, మరికొందరిని విశాఖ పట్నంలో కోర్టులలో ప్రవేశపెట్టేవారు. అప్పట్లో ఈ ముందస్తు విచారణలు జరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువేనని చెప్పాలి. ఏప్రభుత్వం అయినా ఎవరి స్వేచ్చను హరించరాదు. ప్రత్యేకించి పాత్రికేయుల విషయంలో మరింత ఉదారంగా ఉండాలి. కాని ఆ స్వేచ్ఛను పాత్రికేయుల ముసుగులో దుర్వినియోగం చేయడం కూడా తగదు.
చదవండి: చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’
కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం తప్పుడు ప్రచారం చేయడం పద్దతి కాదు. ఒక పార్టీకి మద్దతు ఇస్తే ఇవ్వవచ్చు. ఆ క్రమంలో అబద్దపు, దారుణమైన అభియోగాలను ప్రచారం చేయడం, వాట్సాప్‌లో పార్వార్డ్ చేయడం అంటే దురుద్దేశంతోనే అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనల విషయంలో దేశ వ్యాప్తంగా ఒక విధానం లేకపోతే, ఒక్కో కేసులో ఒక్కో రకంగా పోలీసులు, కోర్టులు వ్యవహరిస్తే అది సమాజానికి మంచి సంకేతం ఇవ్వదేమో!
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment