కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు
రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు
నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు
నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు
ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం
దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు
మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి
నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత
సాక్షి, అమరావతి: ఎన్నికల నామినేషన్లకు సమయం ముంచుకొస్తున్నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎం అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పటికీ కొన్ని సీట్లలో టీడీపీ అభ్యర్థులపై తేల్చుకోలేక తిప్పలు పడుతున్నారు. ఇప్పటికీ నాన్చుతూనే ఉన్నారు. సుమారు 20 సీట్లలో అభ్యర్థులను మారుస్తామని సంకేతాలు ఇచ్చినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ అసహనంతో ఉంది. ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో చంద్రబాబు తడబడుతున్నారనే అభిప్రాయం టీడీపీ నేతల నుంచే వినిపిస్తోంది.
రాజకీయ బ్రోకర్ రఘురామకృష్ణరాజుకు భయపడి ధైర్యంగా ముందుకెళ్లలేకపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. నర్సాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకిచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. దీంతో ఆయన తన బాధ్యతనంతా చంద్రబాబుపైనే పెట్టారు. వెంటనే టీడీపీలో చేరిపోయి తనకు సీటు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. నర్సాపురం ఎంపీ, ఉండి ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒకటి ఆయనకు కట్టబెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఉండి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఇప్పటికే రామరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయనను తప్పించి ఉండి సీటును రఘురామకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో నర్సాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు ఇవ్వడం కోసం దాన్ని బీజేపీ నుంచి తీసుకునేందుకు ప్రతిపాదన పెట్టారు. నర్సాపురం ఎంపీ సీటును తమకు ఇస్తే దాని బదులు ఉండి ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇస్తామని, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాసవర్మను ఉండిలో నిలబెట్టాలని ప్రతిపాదించారు. లేనిపక్షంలో ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇస్తామని, నర్సాపురం ఎంపీ సీటును తమకు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదంతా తన అనుంగు బ్రోకర్ నేత రఘురామకృష్ణరాజు కోసమే కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం, రఘురామకృష్ణరాజుకు లబ్ధి చేకూర్చడం కోసం ఎంతమందినైనా బలి పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను తప్పించి దాన్ని కూడా బీజేపీకి ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అక్కడ బీజేపీ నేత గారపాటి చౌదరి టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతుండటం, బీజేపీ అధిష్టానం నుంచి ఆ దిశగా ఒత్తిడి పెంచడంతో దానికీ బాబు తలొగ్గుతున్నట్లు చెబుతున్నారు.
తన బినామీ కోరిక తీర్చడానికి
అనకాపల్లి జిల్లా మాడుగుల స్థానాన్ని చంద్రబాబు ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు కేటాయించారు. అయితే, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి, తన బినామీ సీఎం రమేష్ మాడుగుల నుంచి ప్రసాద్‌ను తప్పించి, ఆ స్థానాన్ని బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని కోరారు. ఇందుకు కూడా చంద్రబాబు సిద్ధపడ్డారు. అక్కడ పైలా ప్రసాద్‌ను తప్పించి బండారుకు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడి, తిరువూరు, సత్యవేడు స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చి, కొత్తవారిని పెట్టాలని ఆలోచిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల మార్పు ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. అయితే, ఈ స్థానాలన్నింటి పైనా ఇప్పటికీ చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతుండటంతో క్యాడర్‌లో అయోమయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment