కుప్పంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు
సాక్షి, చిత్తూరు: ‘‘ఏం తమషా చేస్తున్నారా? మీ ఇంటికే వచ్చి కొడతా? వైసీపీ రౌడీలకు ఎక్స్‌పైరీ డేట్లు అయిపోయాయి. మగాళ్‌లైతే ఇప్పుడు రండి. రౌడీలు, గూండాలు, ముఠాలు, అణచివేసిన పార్టీ టీడీపీ. నేనూ రోడ్డు మీదకి వస్తా, ఎవరు వస్తారో చూస్తా’’.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం బస్టాండ్ ప్రాంతంలోని అన్న క్యాంటీన్ వద్ద గురువారం ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అన్న క్యాంటీన్‌పై దాడిచేయడం పేదలపై దాడి చేయడమేనన్నారు.
తన హయాంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చానని.. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. దాడులు చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు కాకుండా ఇంటికి పంపడం దారుణమన్నారు. కుప్పంలో జరిగింది ఏమిటో డీజీపీ వచ్చి చూడాలని డిమాండ్ చేశారు. కొల్లుపల్లిలో తన మీటింగ్ దగ్గరికి వచ్చి జెండాలు ఎగరేస్తారా? ఎంత కొవ్వు, ఎంత కండకావరం? అని చంద్రబాబు మండిపడ్డారు. తన ఇంటి గేటుకు తాళాలు వేసి, తాళ్లు కట్టారని, ఎయిర్‌పోర్టులోనూ అడ్డుకున్నారని, కోర్టు నిలదీస్తే డీజీపీ తలదించుకున్నారని తెలిపారు.
మరోవైపు.. తన ఇంటికొచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశారని ఆయన చెప్పారు. 40 ఏళ్లల్లో ఎందరినో చూశానని.. కరుడుకట్టిన నేరస్తుడు సీఎం అయ్యారంటే తప్పు వ్యవస్థదా, ప్రజాస్వామ్యానిదా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరాడతామని ఆయన చెప్పారు. టీడీపీ వారికి ఏమైనా అయితే అది పోలీసుల హత్యేనన్నారు. కొట్టినా, కేసులు పెట్టినా భయపడేది లేదని, వెనక్కిపోయే సమస్యేలేదన్నారు.
ప్రజలే ముందుకు రావాలి..
ఇక తనను కుప్పానికి రాకుండా కుట్రలు పన్నుతున్నారని.. తాను సంకల్పం చేస్తే ప్రాణాలను సైతం లెక్కచేయనని చంద్రబాబు అన్నారు. ప్రాణాలు, ఆస్తులు, మానాలు కాపాడుకోవాలంటే ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వాళ్ల జోలికొస్తే వారి ఇంటికి వేల మందితో తాను వస్తానన్నారు. ధైర్యంగా ఉండండని, ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ రోజు ఎవరిని కొడతారో తాడోపేడో తేల్చుకోవడానికే ఇక్కడకు వచ్చానని.. తాను పిలుపిస్తే కుప్పానికి రెండు లక్షల మంది వస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment