ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సుమారు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, పదిహేను లక్షల మందికి తొలి విడతగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికి సుమారు నాలుగున్నర లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇది ప్రతిపక్ష తెలుగుదేశంకు ఇబ్బందికరమైన విషయమే.
తన హయాంలో పేదలు ఎవరికి ఇలా ఇళ్ల జాగాలు అందచేయలేదు. కాని జగన్ భారీ స్థాయిలో స్థలాలు ఇవ్వడంతో పేద వర్గాలలో విపరీతమైన ఆదరణ చూరగొంటున్నారు. దానిని దెబ్బతీయడానికి టిడిపి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. అందులో భాగంగా జగనన్న కాలనీలు నీట మునక అంటూ బానర్ కథనాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అనేక వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని రాస్తున్నాయి. గతంలో ఇలా రాయాలంటే సిగ్గు పడే పరిస్థితి ఉండేది.
ఒకరిపై ఒకరికి పోటీ ఉండేది. కాని ఇప్పుడు ఈ వర్గం మీడియా లక్ష్యం ఒకటే కాబట్టి అంతా కలిసిపోయి జగన్‌పై అక్రమ యుద్దం చేస్తున్నారు. ఈనాడు, జ్యోతివారికి ఇలా కాలనీలు మునిగిపోవడం ఎంతో సంతోషకరమైన వార్త అన్నమాట. వర్షాలు భారీగా కురిసినప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల నీటి ముంపునకు గురి కావచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత ఆ ముంపు అంతటిని తొలగించి, అక్కడ నివాసం ఉండేవారికి సదుపాయాలు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిన పనే. గత టీడీపీ ప్రభుత్వం అసలు ఇళ్ల స్థలాలే ఇవ్వలేదు కనుక వారికి ఆ ఇబ్బంది లేదు. కాని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలందరికి ఇళ్లు ఉండాలన్న సదుద్దేశంతో ఇన్ని లక్షల ఇళ్లు ఇవ్వడం వీరికి జీర్ణం కావడం లేదు. అంతే వర్షం పడితే చాలు.. ఈనాడు, జ్యోతి రాబందుల మాదిరి ఆ కాలనీవద్దకు వాలిపోయి.. ఇంకేముంది అవి మునిగిపోయాయి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ వార్తలు రాస్తున్నాయి.
ఆ కాలనీలు నివాస యోగ్యంగా ఉండవని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మీడియా వేసిన ఫోటోలు గమనిస్తే అక్కడ అన్ని సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు అర్ధం అవుతుంది. ఉదాహరణకు కాకినాడ వద్ద ఒక లే అవుట్ ఫోటో ప్రచురించారు. దానిని చూస్తే కరెంటు స్తంభాలు వేసి తీగలు కూడా లాగి విద్యుత్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు లే అవుట్ లో పునాదులు లేచాయి. రోడ్ల నిర్మాణం సాగుతోంది. ఇదంతా చూసి టీడీపీ మీడియాకు కన్ను కుట్టింది. దానిని ఎలాగైనా చెడగొట్టాలని అనుకుని, వర్షం నీటిని సాకుగా తీసుకుని వారి మనసులో ఉన్న విషం అంతా కక్కేశారు.
ఎక్కడైనా లే అవుట్‌లలో నీరు వస్తే రాయడం తప్పు కాదు. కాని అవుట్ ప్రపోర్షన్ లో అంటే జర్నలిజం ప్రమాణాలను పాటించకుండా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే యత్నం చేయడమే ఛండాలంగా ఉంది. రామోజీరావు మాదిరి కొండ మీద అంతా పాలెస్ లను కట్టుకోలేరు కదా! వారికి చిన్న గూడు ఏర్పడుతుంటే ఎందుకంత కడుపు మంట. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే అనేక కాలనీలు వర్షాలవల్ల నీట మునిగాయి. ప్రజలు నానా పాట్లు పనడుతున్నారు. వరంగల్, ములుగు వంటి జిల్లాలలో గ్రామీణ జీవనం చిన్నాభిన్నం అయింది.
ఖమ్మంలో ఇళ్లలోకి నీరు వచ్చి మొత్తం విలువైన వస్తువులన్నీ పాడయ్యాయి. రామోజీకి దమ్ముంటే అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే అని రాయగలరా? నిజానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా బాధితులను ఆదుకునే యత్నం చేస్తుంది. కాని ఈనాడు వంటి ఎల్లోమీడియా తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వార్తలు రాస్తున్నదని చెప్పడానికే ఈ విషయం ప్రస్తావించవలసి వస్తోంది.
చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
ఏపీలో లే అవుట్లలో మెరక చేసిన పనులు కూడా జగన్ వందిమాగధులే చేపట్టారని పచ్చి అబద్దాలు రాయడానికి కూడా ఈనాడు షేమ్ ఫీల్ కావడం లేదు. అవన్ని చిన్న, చిన్న కాంట్రాక్టర్లు చేస్తుంటారు. వారికి కూడా రాజకీయాలు అంటగట్టి చెత్త వార్తలు రాస్తున్నారు. ఇంతకీ వారి బాధ ఏమిటి? జగనన్న కాలనీలు నివాసయోగ్యం కావని చెప్పడమే వారి లక్ష్యం అన్నమాట. వారు చెప్పేదాని ప్రకారం హైదరాబాద్ లోని మునిగిపోయిన కాలనీలవారు అక్కడ నివాసం ఉండవద్దని చెబుతోందా? ఆ మాట ఈనాడు అనగలదా?
కొన్ని కాలనీలు వారం రోజులపాటు నీట మునిగే ఉన్నాయి. వాటన్నిటికి కేసీఆర్‌నే బాధ్యుడిగా ఈనాడు రాస్తుందా? ఈ మీడియాకు ఏపీ అంటే ఎందుకు ఇంత కక్ష అంటే తమ మార్గదర్శి సంస్థలో జరుగుతున్న నల్లధనం లావాదేవీలను జగన్ ప్రభుత్వం బయటపెడుతుందా అన్న కోపంతో ఇలా చేస్తున్నారు.
జగనన్న కాలనీలలో పరిస్థితి ఇలా ఉందని రాసినవారు రాజధాని గ్రామాలు ఎన్నిసార్లు నీట మునిగింది. చివరికి హైకోర్టుకు వెళ్లే రహదారి కూడా నీటి ముంపునకు గురైతే ఎన్నడైనా వార్తలు ఇచ్చారు. పేదల ఇళ్లపై విషం చిమ్మేవారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నోరు మెదపరు. అసలు అమరావతి గ్రామాలు లోతట్టు ప్రాంతమని, కృష్ణానది కన్నా తక్కువ మట్టం లో ఉన్నాయని నిపుణులు చెబితే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా అంతా ఎలా బుకాయించింది తెలుసు. కొండవీటి వాగు ముంపు నీటిని తోడి కృష్ణానదిలో కలపడానికి ప్రత్యేక స్కీమును కూడా చేపట్టారు. అయినా అది గొప్ప విషయమే.
అమరావతి అధ్బుత ప్రదేశం అని భజన చేస్తారు. ఎక్కడైనా సమస్యలు ఉండవచ్చు.వాటిని ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళతాయి. విజయవాడలో నిత్యం కృష్ణానది వరదలకు గురయ్యే కృష్ణలంక ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ భారీ రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత జగన్ ది. ఆ విషయం ఏనాడైనా ఈ ఎల్లో మీడియా రాసిందా? ఈ మధ్య విస్సన్నపేట గ్రామం లో ఒక స్కూలు బడిలో వర్షం కురుస్తోందని చెబుతూ కొందరు విద్యార్ధులు గొడుగులు వేసుకుని కూర్చున్నట్లు ఫోటో తీసి పత్రికలలో మొదటి పేజీలలో ప్రముఖంగా వేశారు. తీరా చూస్తే అవన్ని కల్పిత ఫోటోలని తేలింది. పాడైపోయిన ఒక బిల్డింగ్ లో నీరుకారుతున్న చోట కొందరు స్టూడెంట్స్‌ను కూర్చోబెట్టి గొడుగులు పట్టించి ఫోటోలు తీసి ప్రజలను మోసం చేయడానికి కూడా ఈ ఎల్లో మీడియా బరితెగించింది.
ఒకవైపు ఏపీ ప్రభుత్వం వేలాది స్కూళ్లను వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి బాగు చేస్తుంటే, దానిని చూడలేక అసూయతో ఇలాంటి దారుణమైన, నీచమైన కథనాలు ఇస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే స్థానికంగా వార్త ఇవ్వవచ్చు. లేదా లోపలి పేజీలలో ఇవ్వవచ్చు. అదే సమయంలో ఆ బిల్డింగ్ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందా? మరి చంద్రబాబు పాలన టైమ్‌లో బ్రహ్మాండంగా ఉందా? అన్నది రాయాలి కదా? ప్రభుత్వం చక్కగా మార్పులు చేస్తున్న స్కూళ్ల గురించి ఎన్నడైనా ఒక్క ముక్క రాశారా? వాటిని రాయని జర్నలిస్టులకు ఈ వార్తలు రాసే నైతిక హక్కు ఉంటుందా? పోనీ అది కూడా సమతుల్యంగా రాయడం లేదంటే ఏమని అనుకోవాలి.
వారు ఆత్మవంచన చేసుకుని అయినా ఉండాలి. లేదా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారన్న విమర్శలకు సిద్దపడైనా ఉండాలి. ఆ మీడియా యాజమాన్యాలు తెలుగుదేశంతో కుమ్మక్కు అయ్యాయి కనుక, ఆ సంస్థలలో పనిచేసే జర్నలిస్టులకు ఇదొక అగ్నిపరీక్షగా మారుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ జర్నలిస్టులకు ఇలాంటి విషమ పరీక్ష తప్పదు. వారికే కాదు.. ఏపీ ప్రజలకు ఈ పీడ పోవాలంటే వచ్చే ఎన్నికలవరకు ఆగక తప్పదు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment