సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామాలను స్వీమ్స్ డాక్టర్లు బట్టబయలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్శిటీ వద్ద పోలింగ్ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్ వైద్య నివేదికలు తేల్చి చెప్పాయి.
స్విమ్స్ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్.. ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడికాలేదు. వైద్య నివేదికలు అన్ని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తేల్చాయి. రాజకీయ లబ్ధి కోసం పులివర్తి నాని నాటకాలు ఆడినట్లు తేటతెల్లమైంది.
మే 14వ తేది మధ్యాహ్నం 3గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్శిటీ పరిసరాల్లోనే నాని హుషారుగా నడుస్తూ కనిపించిన పులివర్తి నాని వీడియో దృశ్యాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న నాని.. చక్కగా నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని.. తర్వాత వీల్ చైర్‌లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.
తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఇలా అన్ని పరీక్షలను విడుదల చేశారు. ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐలు, సిటీ స్కానింగ్. వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోనూ, వారి కుటుంబసభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేని వ్యక్తి పెట్టిన కేసులో 37 మంది జైలు పాలయ్యారు. నెలల తరబడి జైలులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment