చంద్రబాబుతో కేశినేని నాని మంతనాలు (ఫైల్)
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిత్వంపై టీడీపీలో తీవ్ర తకరారు నెలకొంది. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుపడుతుండగా ఆయన వ్యతిరేకవర్గం అడ్డుతగులుతోంది. గుంటూరు మేయర్ అభ్యరి్థగా అక్కడి పశి్చమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని)ను టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ మేయర్ అభ్యర్థులుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎలా ఖరారు చేస్తారనే ప్రశ్నను కేశినేని వ్యతిరేకవర్గం లేవనెత్తుతోంది. కోవెలమూడి, కేశినేనిలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే.
బాబు వ్యూహంతోనే శ్వేతకు చెక్
కేశినేని శ్వేతకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకూడదనే చంద్రబాబు ముందస్తు వ్యూహం పన్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం పార్టీ ప్రధాన కార్యా లయంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు గుంటూరు, విజయవాడ ముఖ్య నాయకులతో మాట్లాడారు. కోవెలమూడి రవీంద్రను గుంటూరు మేయర్ అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించారు. కేశినేని నానీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులతోనూ చర్చించిన అచ్చెన్నాయుడు కలిసిమెలిసి పనిచేయాలని సూచించారే తప్ప శ్వేతను బెజవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోవడమే ట్విస్ట్. ఇటీవలి కాలంలో కేశినేని స్వరం అధిష్టానాన్ని ధిక్కరించే రీతిలో ఉంటోందని చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి.
విజయవాడకు తానే అధిష్టానమని, తనకు ఎవరూ హైకమండ్ లేరని, 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పినప్పుడు లేని తప్పులు 39వ డివిజన్ అభ్యర్థిగా శివశర్మను చేస్తే ఎందుకు వస్తాయి, ఓడిపోయిన వారు మాట్లాడేది ఏంటి, వారి మాట వినే పరిస్థితి లేదనే బహిరంగ వ్యాఖ్యానాలు చేయడాన్ని బాబు దృష్టికి వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి లోకేష్‌నుద్దేశించి నాని అభిప్రాయాలు కూడా చంద్రబాబు చెవిన వేశారనేది వినికిడి. శ్వేత మేయర్‌గా తను చెప్పలేదని, ఎంపీ స్వయం ప్రకటితమని బాబు గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు బుద్దా, మీరాలకు తోడు దేవినేని ఉమ, బొండా ఉమ, వర్ల రామయ్య, పట్టాభి కూటమి కేశినేనికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యమే.
సామాజిక వర్గం సాకుగా...
కేశినేని వ్యతిరేక కూటమి మాటలకు ప్రాధాన్యమివ్వడం, కేశినేనికి చెక్ పెట్టడంలో భాగంగానే కోవెలమూడి పేరు వెలువడింది. తద్వారా రాజధాని ప్రాంతంలోని రెండు కార్పొరేషన్‌లలో ఒకే సామాజిక వర్గానికి మేయర్ పదవులా అనే వివాదానికి తెరతీసేందుకు వీలవుతోంది. దీన్నే సాకుగా చూపి శ్వేతకు చెక్ పెట్టవచ్చనేది బాబు ఎత్తుగడగని స్వపక్షీయులే అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా కోవెలమూడి నానికి గుంటూరు నగరంలో ఉన్నంత వ్యతిరేకత మరెవరికీ లేదు. అవినీతి ఆరోపణలు, మోసాలు లెక్కకుమిక్కిలి ఉన్నాయని మేయర్‌గా పేరు ప్రకటించవద్దని సీనియర్లు అధిష్టానానికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నానికి చెక్ పెట్టాలంటే కోవెలమూడి పేరును ప్రకటించాలని అచ్చెన్నకు బాబు సూచించి కుప్పంకు బయలుదేరినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
బుద్ధా హైదరాబాద్‌కు...
చంద్రబాబుకు నమ్మిన బంటునని చెప్పుకునే బుద్ధా వెంకన్న గురువారం అచ్చెన్నతో మీటింగ్ కాగానే కుమారుడు బుద్ధా వరుణ్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కూతురు పూజితకు కాకుండా కేశినేని బలపరిచిన శివశర్మకే 39వ డివిజన్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందునే బుద్ధా వెళ్లారంటున్నారు. నాయకుల అలక తీర్చే సాకుతో శ్వేత పేరును ప్రకటించకుండా వాయిదా వేయడానికి బాబు కోటరి వేసిన మరో ఎత్తుగడగా కేశినేని వర్గం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment