సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని
పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు.
వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment