సాక్షి,అమరావతి: దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సామాజిక కోణంలో ఊహకు కూడా అందని విధంగా మంత్రివర్గం ఏర్పాటు జరిగిందని బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీల శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు ఏపీలో రాజ్యాధికారం దక్కిందని చెప్పారు. అందుకే దీన్ని సామాజిక కేబినెట్ అని చెబుతున్నామన్నారు. రాజ్యాధికారం కోసం ఎందరో మాటలు చెప్పారని, దాన్ని సాకారం చేసింది మాత్రం సీఎం జగన్ అని తెలిపారు. నూతన మంత్రివర్గంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. అంటే 70 శాతం ఉన్నారని చెప్పారు. బీసీలు, మైనారిటీలు 11 మంది, ఎస్సీలు ఐదుగురు, ఒక ఎస్టీ ఉన్నారని తెలిపారు. ఇది ఒక సామాజిక విప్లవంగా చెప్పవచ్చన్నారు. అందుకే చంద్రబాబుకు, టీడీపీకి దిక్కు తోచక అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమి చేశారు, ఈ 34 నెలల పాలనలో జగన్ ఏమి చేశారో చర్చకు సిద్ధమని అన్నారు. బాబుకు, టీడీపీ వారికి ధైర్యముంటే చర్చకు రావాలన్నారు.
బీసీలకు జగన్ అత్యంత ప్రాధాన్యం
రాష్ట్రంలో ఉన్న దాదాపు 139 బీసీ కులాల వారిని గతంలో ఏ ప్రభుత్వమూ గుర్తించలేదని చెప్పారు. కానీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. పనికి రాని పని ముట్లు ఇచ్చారని, అవి ఉపయోగపడకపోగా వాటిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని చెప్పారు. బీసీ కార్పొరేషన్ల గురించి బాబు ఆలోచించలేదన్నారు. గతంలో బీసీలకు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి వారు బాగా చదువుకొనేలా చూశారని తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరు గార్చారన్నారు. పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు. అందులో అంతులేని అవినీతి జరిగేదని చెప్పారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన ఇంటి గడప వద్దనే అందుతోందన్నారు. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో 2100 ప్రొసీజర్లు ఉంటే, వాటిని బాబు 1000కి తగ్గించారన్నారు. జగన్ సీఎం కాగానే ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2500 ప్రొసీజర్లు తెచ్చారని తెలిపారు.
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం
Published Tue, Apr 12 2022 4:01 AM | Last Updated on Tue, Apr 12 2022 4:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment