తూర్పుగోదావరి, సాక్షి: పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దాని వల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో వేణుగోపాలకృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు జాగ్రత్తగా పని చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోంది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తి అయితే వస్తుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడదీసేది సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలి’’ అని అన్నారాయన.
చంద్రబాబుపై ఫైర్..
2016 మే 2 న పోలవరం పనులు ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రమే చేపడుతుందని ప్రకటించారు. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్ట పోయారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ గురించి కూడా ఆలోచించాలి. కాపర్ డ్యామ్ చేపట్టే నాటికే స్పిల్ వే పూర్తయి ఉండాలి. కానీ, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ నేరుగా ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం భారీగా ప్రజాధనాన్ని నష్టపోయింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండా చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment