‘అమరావతి పేరు చెప్పి.. గ్రాఫిక్స్‌తో గడిపారు’ | Chief Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu Naidu Over Amaravati | Sakshi
Sakshi News home page

‘అమరావతి పేరు చెప్పి.. గ్రాఫిక్స్‌తో గడిపారు’

Published Wed, Jan 5 2022 3:27 AM | Last Updated on Wed, Jan 5 2022 4:52 AM

Chief Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu Naidu Over Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నిజంగా విజన్‌ ఉంటే ఐదేళ్లలో ఆయన అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీ బూమ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు కదా ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్నా హైదరాబాద్‌ ఐటీ పరంగా అదే జరిగి ఉండేదన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలపై నారావారిపల్లెలో చర్చించేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనేది అక్కడ లేదని, అది ఒక పాడుపడిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ అని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పశువులను తెచ్చి కట్టేశారని చెప్పారు. అమరావతిలో ఐకానిక్‌ బ్రిడ్జిలు లేవు, ఇడ్లీ పాత్ర లాంటి స్ట్రక్చర్లూ లేవన్నారు. కనీసం డ్రైనేజీ, తాగునీరు కూడా లేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు నిర్మిస్తామన్న క్వార్టర్స్‌ను కనీస దశకు కూడా తీసుకు రాలేదన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన రూ.10 వేల కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలన్నారు. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని, ప్రస్తుతం ఆయన నివాసముంటున్న ఇంటి డ్రైనేజీ నీటిని కూడా కృష్ణా నదిలోకి వదులుతున్నారన్నారు. 

సీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు కనపడదా? 
రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటించి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చించారని గడికోట తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు  అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారని నిలదీశారు. ఆయనకు విజన్‌ ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం కనిపించదా? అని ప్రశ్నించారు. స్వార్థం, బినామీల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు.  

హోదాను చంపేసి అర్ధరాత్రి ప్యాకేజీ 
చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు వస్తే సీఎం జగన్‌ పాలనలో రెండున్నరేళ్లలో గ్రౌండ్‌ అయిన ప్రాజెక్టుల విలువ రూ.40 వేల కోట్లు అని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు ప్రతి నెలా రూ.3 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదాను చంపేసి అర్థరాత్రి ప్యాకేజీకి స్వాగతం పలికింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. నేతల విగ్రహాలపై తమ ప్రభుత్వానికి ద్వేషం ఉండదని చెప్పారు. ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు అతడిని వెంటనే అరెస్టు చేశారని తెలిపారు. కులమతాల పేరుతో రెచ్చగొడుతోంది చంద్రబాబేనని స్పష్టం చేశారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement