‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమోస స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వస్తున్నారు. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో సదరు ఎస్సై (సమోసాలు సీఎం కోసమని చెప్పకుండా) .. తన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్‌ఐ), హెడ్ కానిస్టేబుల్‌ను సమోసాలు తీసుకుని రావాలని పురమాయించారు.
ఎస్సై ఆదేశాలతో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల సమోసాలను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన సమోసాల్ని పక్కనే ఉన్న మహిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాలని కోరారు. మహిళా ఎస్సై ఆ సమోసాలను సీఎం కోసం తెచ్చినవే అని తెలియక బదులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ సమోసాల్ని తిన్నారు.
మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలకు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment